Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

“వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”

దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం కవికులగురువు లాంటి కాళిదాసు రఘువంశం కావ్యంలో మొదట అన్న మాట ఇది. సాగరసంగమం సినిమాలో ఈ శ్లోకాన్ని పాటకు వాడుకున్న వేటూరి మొదట “పార్వతీపరమేశ్వరౌ” అని, రెండో సారి “పార్వతీప రమేశ్వరౌ” అని విడదీశాడు. మొదటిది శివపార్వతులు; రెండోది లక్ష్మీనారాయణులు అన్నది వేటూరి విరుపులో ఉద్దేశం. కానీ- కాళిదాసు ఉద్దేశం మాత్రం పార్వతీపరమేశ్వరౌ- శివపార్వతులే. విరిచింది వేటూరి; పాడింది బాలు, పాడించింది విశ్వనాథుడు. దాంతో లోకం అంగీకరించినట్లుంది.

ఓంకారంలో అ ఉ మ బిందు నాద- అయిదు కలిసి ఉంటాయి. శివుడి ఢమరుకంలో నుండి అక్షరాలు పుట్టాయి. వాటినే మాహేశ్వర సూత్రాలు అన్నారు. అందులో అ నుండి చ్ వరకు ఉన్నవి అచ్చులయ్యాయి. హ నుండి ల్ వరకు ఉన్నవి హల్లులయ్యాయి. వాక్కు శబ్దం. ఆ శబ్దానికి లక్ష్యం లేదా ఉద్దేశం అర్థం. వాక్కునుండి అర్థాన్ని విడదీయలేం. లేదా అర్థవంతమయిన శబ్దంలోనుండి వాక్కును వేరుచేయలేం. అలాంటి శబ్దం లేదా వాక్కు శివుడు. ఆ శబ్దాల అర్థం, పరమార్థం పార్వతి. అలా కలసి ఉన్న శివపార్వతులకు నా నమస్కారం అంటాడు కాళిదాసు. హైందవం అన్న ఒక ముద్రవేసి కాళిదాసులాంటివారి సాహిత్యాన్ని మూటగట్టి మూల కూర్చోబెట్టాము. భాషలో, భావంలో, కవితా సాంద్రతలో, అలంకారాల్లో, ప్రయోగాల్లో, వ్యక్తీకరణల్లో ఇంకో యుగానికి కూడా కాళిదాసు లాంటి ఆధునికుడు పుట్టడు. ఒకవేళ పుట్టినా మనం గుర్తించలేం.

శివపార్వతులను వేరుగా చూడకూడదు అనడానికి కాళిదాసు వేరుచేయడానికి వీల్లేని వాక్కు అర్థాలను ఎంచుకున్నాడు. శంకరాచార్యులయితే ఇంకో మెట్టు పైకెళ్లి- శివుడిలో అంత శక్తికి నువ్వే కదా తల్లీ కారణం? అని ఆమెనే అడిగాడు. ఆమె కాదనలేదు. పక్కనే ఉన్న శివుడు కూడా కాదనలేదు. విష్ణు శక్తికి లక్ష్మి కీలకమని శంకరాచార్యులే అనేకచోట్ల నిరూపించాడు.

పార్వతి, లక్ష్మి, సరస్వతులను విడిగా పూజించవచ్చు కానీ- శివుడు, విష్ణువులను విడిగా పూజించి లాభం లేదు. పార్వతీసహిత శివుడిని, లక్ష్మీసహిత విష్ణువును పూజిస్తేనే పుణ్యం, లాభం, శీఘ్రఫలం. అంటే అమ్మ అనుమతిస్తేనే అయ్య వరాలివ్వాలన్నది ఇందులో రహస్యం. అమ్మ- అయ్య కలిసి ఉంటేనే మనం హమ్మయ్య అని గుండెమీద చేయి వేసుకుని ధైర్యంగా ఉండవచ్చు.

వేదాలు, పురాణాలు, శక్తి స్వరూపాలను సరిగ్గా అన్వయించుకోక, అర్థం చేసుకోక మనం తికమకపడుతున్నాం. నిజానికి ఆచారంలో అమ్మకు ఉన్న ప్రాధాన్యం- అయ్యకు లేదు.

అమ్మాయి పుడితే మన ఇంట్లో లక్ష్మీదేవి పుట్టినట్లే. మన ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్లే. అనాదిగా ఇది మన నమ్మకం. మధ్యలో అమ్మాయిలు బరువై, దిగులై, వదిలించుకోవాల్సినవారై ఏదేదో చెప్పకుడనవన్నీ జరిగాయి. జరుగుతున్నాయి.

గతంలో రంగారెడ్డి జిల్లాలో ఒక వార్త ఇది. ప్రసవానికి ఒక మహిళ పుట్టింటికి వెళ్లింది. పండంటి అమ్మాయిని కన్నది. మూడు నెలలతరువాత అత్తవారింటికి బిడ్డను ఒళ్లో పెట్టుకుని వచ్చింది. కోడలికి, కోడలి పొత్తిళ్లలో ఉన్న మనవరాలికి అత్తింటివారు పూలతో స్వాగతించారు. తోరణాలతో ఆహ్వానించారు. లక్ష్మీదేవిని ప్రసవించి, ఆ లక్ష్మిని ఇంటికి తెస్తుంటే చేయాల్సిన రాజోపచార, శక్త్యోపచార…పరవశోపచార సపర్యలన్నీ చేశారు.

ఆ అత్తమామలు కలకాలం చల్లగా ఉండాలి. వారి ఇల్లు నిజంగా లక్ష్మీ నిలయం కావాలి. చిన్నవార్తే అయినా ఇందులో పైకి చెప్పలేని ఎన్నెన్నో ఇతరేతర విషయాలు దాగి ఉన్నాయి.

తాజాగా రాజస్థాన్ లో ఒక ఊళ్లో అత్తింటివారు- కోడలికి, మనవరాలికి ఇలాంటి అపూర్వమయిన స్వాగతమిచ్చారు. ముప్పయ్ అయిదేళ్లుగా తమ కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టలేదని, లేక లేక కలిగిన మహాలక్ష్మిని పుట్టింటి నుండి మెట్టిన ఇంటికి సాదరంగా తీసుకెళ్లడానికి అత్తింటివారు హెలిక్యాప్టర్ ఏర్పాటు చేశారు. భర్త అందులో వెళ్లి రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరి, భార్యను, గారాల కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు. దిగగానే అత్తింటివారు పూలు చల్లి స్వాగతం పలికారు. మేళ తాళాలతో ఇంట్లోకి స్వాగతం పలికారు.

“సిరిదా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!”

సిరి ఎన్నో సిరులను మూటగట్టుకుని మన గుమ్మంలోకి వస్తూనే ఉంటుంది. కానీ- వచ్చింది అమ్మగా, కూతురిగా, కోడలుగా, చెల్లెలుగా, అక్కగా, మనవరాలిగా, అత్తగా, చిన్నమ్మగా, పెద్దమ్మగా…అమ్మలగన్నయమ్మ- ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ- అని తెలుసుకోలేం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com