Friday, November 22, 2024
Homeసినిమాఅక్టోబర్ వరకు ఆగండి: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ వినతి

అక్టోబర్ వరకు ఆగండి: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ వినతి

Telangana Film Chamber of Commerce appealed Producers not to go for OTTs up to October  :

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్యర్వంలో ఎగ్జిబిటర్స్‌ సమావేశం తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ హాల్‌లో శనివారం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్‌ ఇంకా తెరుచుకోనందున నిర్మాతలు ఓటీటీ వేదికలపై తమ సినిమాలను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై స్పందిస్తూ  “ఈ ఏడాది అక్టోబరు వరకు నిర్మాతలు వేచి చూడాలని ఒకవేళ థియేటర్స్‌ రీ-ఓపెన్‌ కాకపోతే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీల్లో  సినిమాలు విడుదల చేసుకోవాలని నిర్మాతలను కోరుతున్నాము. ఈ నిర్ణయాన్ని ఈ సమావేశానికి హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు’ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.

నిర్మాతలకు విన్నపం..
“తెలుగు సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలందరు మా విన్నపాన్ని పరిగణించమని కోరుకుంటున్నాం. లేకపోతే తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో తెలియజేస్తుంది. తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో ఓ జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించుకుంది. ఈ నెల 7న హైదరాబాద్‌లోని తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్, కాన్ఫరెన్స్‌ హాల్, రామానాయుడు బిల్డింగ్‌లో ఈ మీటింగ్‌ జరుగనుంది”.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి..
“ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్స్‌ ఆఫ్‌ ఆంధ్రపదేశ్‌ వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంత తక్కువ సినిమా టికెట్‌ రేట్లు ఉంటే అది థియేటర్స్, ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌ మనుగడకే సమస్య అవుతుంది. చాలా మంది ఉపాధిని కోల్పోతారు. థియేటర్లలో సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలకు ముందుకు రారు. ఇది తెలంగాణ బిజినెస్‌ పై కూడా ప్రభావం చూపుతుంది. కావున టికెట్‌ రేట్ల విషయంలో ప్రభుత్వం ఓ సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం” అని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలియచేసింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్