కోవిడ్ బాధితులకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అందిస్తున్న ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జు, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచించారు.
ఆయుర్వేద మందు విషయంలో నెల్లూరులో నెలకొన్న పరిస్థితులు, వేలాదిగా ప్రజలు తరలివస్తున్న విషయం ఉపరాష్ట్రపతి దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి మరియు డైరక్టర్ జనరల్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు.
అంతకు ముందు కృష్ణపట్నం చుట్టు పక్కల గ్రామాలకు చెందిన తమ పరిచయస్తులతో మాట్లాడిన ఉపరాష్ట్రపతి, విషయ పూర్వాపరాలు తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన అంశాలను కేంద్ర మంత్రి మరియు డైరక్టర్ జనరల్ కు వివరించి, దీనికి సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు.
విషయ ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే ఆ మందు మీద అధ్యయనం ప్రారంభించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.