Friday, November 22, 2024
Homeతెలంగాణఇంకా నిర్ణయం తీసుకోలేదు : రమణ

ఇంకా నిర్ణయం తీసుకోలేదు : రమణ

పార్టీ మారే విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అందరికీ చెప్పే తీసుకుంటానని, చంద్రబాబుకు చెప్పే రాజకీయంగా ముందుకు వెళతానని రమణ వెల్లడించారు. పార్టీ మారతానని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. పార్టీ మార్పుపై తనకు ఎవరూ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని చెప్పారు. పదవుల కోసం, ప్రాపర్టీల కోసం ఎప్పుడూ పాకులాడలేదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. బిజెపి, టి ఆర్ ఎస్ నేతలు తనను సంప్రదించలేదని, వారు ఎలాంటి ప్రతిపాదనలు తన ముందు పెట్టలేదని వెల్లడించారు. ఏవో పదవులు తనకు ఇవ్వబోతున్నరంటూ వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టి పారేశారు రమణ.

ఓ సాధారణ కుటుంబం నుంచి ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చానని, చందబాబు ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకున్నానని, బలహీన వర్గాల గొంతుకగా నిలిచానని చెప్పారు. చంద్రబాబు హయాంలో చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో మహత్తర అవకాశాలు కల్పించిందని, ఆ పార్టీ అప్పగించిన అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిచానని, ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా అంకిత భావంతో పని చేస్తున్నానని చెప్పారు.

కొంత కాలంగా తెలంగాణా లో తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని రమణ అంగీకరించారు. ఎన్నికల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశానని, పరిస్థితి సానుకూలంగా లేదని తెలిసినా పార్టీ మనుగడ కోసం బరిలో దిగానని వివరించారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఊహించని మార్పులు, పరిణామాలు జరుగుతున్నాయని విశ్లేషించారు. మార్పులకు అనుగుణంగా పార్టీలు, నేతలు మారకపోతే మనుగడ ఉండదని, రాజకీయాల్లో రిస్క్ చేయడం తప్పదని వ్యాఖానించారు.

నాకు రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటివరకూ తనతో నడిచిన కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం గత రెండు రోజులుగా చేస్తున్నానని, ప్రజాజీవితంలో మరింత కాలం మనుగడ సాధించాలంటే మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారని వివరించారు. త్వరలో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. అయితే చంద్రబాబుని ఇబ్బంది పెట్టె విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని, ఇక ముందు కూడా అలా చేయబోనని రమణ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్