సుప్రసిద్ధ నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా బాల్యంలో పేదరికాన్ని అనుభవించారు. తండ్రి తాగుబోతు. కుటుంబాన్ని పట్టించుకునేవారుకాదు. తల్లేమో పిల్లలకు సంగీతం చెప్పి వచ్చే డబ్బులతో కుటుంబాన్ని నడిపించేది. కొడుకు బెర్నార్డ్ షాని చదివించలేకపోయింది.
దాంతో బెర్నార్డ్ షా ఓ కార్యాలయంలో ఉద్యోగానికి చేరాడు. చిన్న చిన్న పనులు చేసేవాడు. అయితే ఆ పనులు చేయడం ఆయనకు నచ్చలేదు. తన జీవితం ఎందుకూ పనికీ రాకుండాపోతుందేమోనని బాధపడుతుండేవాడు. అక్కడ పని మానేసి తల్లికి ఓ లేఖ రాసాడు…. “దేవుడిచ్చింది ఒకటే జీవితం. ఈ జీవితాన్ని ఆఫీస్ బాయ్ గా వృధా పోనివ్వను” అన్నదే ఆ ఈత్తరం సారాంశం.
అనంతరం నిండు ఆత్మవిశ్వాసంతో నడిచిన షా సుప్రసిద్ధ రచయితగా పేరు ప్రతిష్ఠలు గడించారు. అయినా ఈ విజయం ఆయనకంత సులభంగా దక్కలేదు. నవలలు రాసారు. కానీ ఆదరణ లభించలేదు. కళల గురించి వ్యాసాలు, సంగీత విమర్శలు అనేకం రాశారు. అయితే ఇక లాభం లేదనుకున్న షా నాటకాలు రాయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన దశ మారిపోయింది.
భగవంతుడిచ్చిన ఒకే ఒక్క జీవితాన్ని వృధా చేసుకోనని చిన్నతనంలోనే చెప్పిన తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి తలెత్తుకుని జీవించడం విశేషం. ఆయన ఓ లక్ష్యంతో నడిచారు. ఆ దిశలో కృషి చేశారు. ఈ మధ్యలో వచ్చిన అవరోధాలను అధిగమించారు. నిరీక్షణ, సహనం ఆయన పురోగతికి సోపానాలయ్యాయి.
-యామిజాల జగదీశ్