Thursday, June 11, 2026

ఏ ఐ తెలుగు

భారత ప్రభుత్వం కృత్రిమ మేధ-ఏ ఐ లో వెనుకపడకుండా చొరవగా ప్రపంచంతో పోటీ పడుతూ ఢిల్లీలో డిక్లరేషన్ ప్రకటించిన వెంటనే, ఉత్తరప్రదేశ్ మీరట్ లో హై స్పీడ్ మెట్రో రైలును ప్రధాని ప్రారంభించి అందులోనే ప్రయాణించిన వార్తలు చల్లారకముందే నేను వందే భారత్ రైలెక్కాల్సి వచ్చింది. వేగంలో విమానాలతో పోటీ పడాలన్నది భారత్ రైళ్ళ తాపత్రయం. మంచిదే. భవిష్యత్తులో నగరాల మధ్య బుల్లెట్ రైళ్ళు వాయు మనో వేగాలతో తిరుగుతాయని వార్తలు ఊరిస్తున్నాయి. వందే భారత్ ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ టికెట్ ధర మాత్రం నిజంగానే విమానంతో పోటీ పడుతోంది. సగటు భాషాభిమానిగా, భాషాశాస్త్ర విద్యార్థిగా రైలు ప్రయాణంలో ప్రతిసారీ వినకూడనివి వినాల్సి వస్తోంది. అలాగని అవి అన్ పార్లమెంటరీ కాదు. అభ్యంతరకరమైన బూతులు కూడా కావు. పైగా పచ్చి బూతులకు తెలుగు సినిమా పాటల్లో పెద్ద పీట వేశాక…పెళ్ళి పీటలమీద ముసలి ముతకా అందరూ ఆ కెవ్వు కేక ముతక పాటలకే సంగీత్ గంతులేస్తున్న శుభవేళ వాటిని బూతులు అన్నవారి కళ్ళు పోతాయి!

రైల్వే స్టేషన్లో, వందే భారత్ రైలు లోపల అనౌన్స్ మెంట్ దానికదిగా ఒక ప్రత్యేక యాంత్రిక భాష. అందులో సమాచారం ముఖ్యం. టైమ్, ట్రెయిన్ నంబర్ మరీ ముఖ్యం. ఆ సమాచారమంతా ముక్కలు ముక్కలుగా ఆడియో ఫైల్స్ ముందే సిస్టంలో రికార్డ్ అయి ఉంటుంది. 20704 రైలు 5.45 నిముషాలకు ఒకటో నంబరు ప్లాట్ ఫార్మ్ పైకి వస్తోంది; మరికాసేపట్లో ఖమ్మం స్టేషన్ వస్తుంది… లాంటి ప్రకటనలు ప్లాట్ ఫార్మ్ మీద, ట్రెయిన్ లోపల వినిపిస్తూ ఉంటాయి.

సమాచారమే సంపద. రైల్వే అనౌన్స్ మెంట్లలో ఆ సమాచార సంపదను ముక్కలు ముక్కలుగా ఒళ్ళంతా చెవులు చేసుకుని ఒడిసిపట్టుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులమీదే పడి ఉంటుంది. ఎందుకంటే అది తెలుగే. కానీ తెలుగువాళ్ళకు అర్థం కాని తెలుగు. పలికేది మనిషి కాదు- అయినా దానికో వ్యాకరణం ఉండి ఏడుస్తుంది! పలికేది గొంతు కాదు- కానీ, దానికో ఉచ్చారణ పద్ధతి ఉండి చస్తుంది!

లేపాక్షి వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరుబయట మర్రి చెట్టు నీడలో నేల మీద కూర్చోబెట్టి…చింత బరిగె చేతబట్టి ఎప్పుడో ఆరేడు తరగతుల్లో 1980లలో మా లోకభూషణం సార్ చెప్పిన తెలుగు విభక్తి ప్రత్యయాలు. ఆ విభక్తులకు, ప్రత్యయాలకు అంత విలువ ఉంటుందని వందే భారత్ రైలెక్కిన ప్రతిసారీ నాకు తెలిసి వస్తూ ఉంటుంది.

థాంక్యూ ఫర్ ట్రావెలింగ్ విత్ ఇండియన్ రైల్వే అన్న ఇంగ్లిష్ ప్రకటన వెంటనే మైకులో భారతీయ రైల్వే”తో” ప్రయాణించినందుకు ధన్యవాదములు- అని వినపడుతుంది. ఇక్కడ తో, లో, లోపల …ఇలా ఏ ప్రత్యయానికి ఏ విభక్తి అర్థం సరైనదో నాకు సరిగ్గా అర్థమై చావదు. భక్తిశ్రద్ధలతో విభక్తులు చెప్పిన మా లోకభూషణం సారేమో ఈలోకంలో లేరు. ఇంకా సగం ప్రయాణం కూడా కాకముందే ప్రయాణించినందుకు థాంక్స్ అంటూ పాస్ట్ టెన్స్ భూతకాలంలో చెప్పడంలో ఆంతర్యమేమిటో నాకు అంతుబట్టదు. ప్రయాణిస్తున్నందుకు అని ప్రెజెంట్ టెన్సో, కంటిన్యుయస్ టెన్సో కదా ఇక్కడ ఉండాలి? ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యుయస్ టెన్స్ వాడినా ఓకే!

అయినా మన పిచ్చిగానీ…ఇంగ్లిష్ లో అయితే ఇలాంటివి తప్పుబట్టాలి. తెలుగులో ఎలా ఉన్నా వినాల్సిందే! ఏయ్! ఎవర్రా అక్కడ? తెలుగు అంతరించిపోతుందని గొంతుచించుకుని అరుస్తున్నది? వాడి చేతులు కాళ్ళు కట్టేసి వందే భారత్ లో వేసి…మైకు ఆన్ చేసి హై వాల్యూమ్ లో ఏ ఐ తెలుగు అనౌన్స్ మెంట్లు బ్యాక్ టు బ్యాక్ వినిపించండి!!

ఇంతకూ-
నేను రైలు”తో” ప్రయాణించానా?
రైలు”లో” ప్రయాణించానా?
రైలు”పై” ప్రయాణించానా?
రైలు “కొరకు” ప్రయాణించానా?

అందుకే చిన్నప్పుడు తెలుగు టీచర్లు విభక్తులు చెప్పినప్పుడు సరిగ్గా, శ్రద్ధగా, ఏకాగ్రతతో వినాలి. లేకపోతే రైల్లో వినపడే విభక్తులను అన్వయించుకోలేక ఇలా నాలాగా మధ్యలోనే దిగి చేతులు జేబుల్లో పెట్టుకుని అగమ్యగోచరంగా వెళ్లాల్సి ఉంటుంది!!

లోన్, లోపల, చేతన్, చేన్, తోడన్, తోన్, వలనన్, క్యాంటిన్ పట్టి… ప్యాసింజర్ భయభక్తి!
డు, ము, వు, లు…రైల్వే ఆడియో ట్రాక్ విభక్తి!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular