Friday, March 20, 2026
HomeTrending Newsటీఆర్ఎస్ అవినీతికి కాళేశ్వరం నిదర్శనం - రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ అవినీతికి కాళేశ్వరం నిదర్శనం – రేవంత్ రెడ్డి

కాళేశ్వరంతోపాటు టీఆర్ఎస్ అవినీతి కారణంగా నిండా మునిగిన సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టేందుకు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన మల్లు భట్టి విక్రమార్క. నేతృత్వంలోని సీఎల్సీ బృందాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని టీపీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నిన్న కూడా ప్రభుత్వం ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్యలను అరెస్ట్ చేసి పిరికిపందలా వ్యవహరించింది. గత నెలలో వరదలు వచ్చినప్పుడే కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టులకు భారీ నష్టం జరిగిందని మేము చెబితే ప్రభుత్వం మా మాటలను పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యవహరించిందని విమర్శించారు.

గోదావరి వరదల వల్ల జులై 14న అన్నారం (సరస్వతి), కన్నెపల్లి (లక్ష్మి) పంప్ హౌస్లు నీట మునిగాయి. కన్నెపల్లి పంప్ హౌస్ లో క్వాలిటీ లేకుండా కట్టిన ప్రొటెక్షన్ వాల్, దాంతోపాటే క్రేన్లు, లిప్పు కూలడంతో మోటార్లు తుక్కుతుక్కు అయ్యాయి. డిజైన్ లోపం అన్నారం పంప్ హౌసుకు శాపంగా మారింది. ఫలితంగా వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇంజనీరింగ్ నిపుణలు పేర్కొంటున్నారని చెప్పారు.

వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యతరాహిత్యంగా.. కేవలం రూ.25 కోట్ల నష్టం మాత్రమే జరిగిందని, ఆ నష్టాన్ని కూడా కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో అబద్ధాలను ప్రచారం చేయించింది. ఈ మొత్తం వ్యవహరంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు వెళ్తున్న మల్లు భట్టి విక్రమార్క. నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందాన్ని పదే పదే అడ్డుకుంటున్నారు.

ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో శాంతి భద్రతలు సమస్యలు లేవు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెళ్లి అక్కడ. విధ్వంసం సృష్టించే పరిస్థితి లేదు. ప్రభుత్వంతో సమానంగా ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద కూడా ఉంటుంది. ప్రాజెక్టులను సందర్శించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ నిరకుశంగా వ్యవహరిస్తోంది. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమీ నష్టం జరగకుంటే దాన్ని చూపించడానికి కేసీఆర్ ఎందుకు వణుకుతున్నారు.

పంపు హౌసులు మునగకుంటే, మోటార్లు విధ్వంసం కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలకు చూపించడానికి కేసీఆర్ ఎందుకు భయపడతున్నారు. వాస్తవాలు బయటికి వస్తాయనే సీఎల్పీ బృందం పర్యటనకు ప్రభుత్వం అడ్డు పడుతోంది. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడానికి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని సీఎల్సీ బృందాన్ని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాను. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి.

మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ప్రాజెక్టుల సందర్శనకు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. దగ్గరుండి ప్రభుత్వమే ప్రాజెక్టులను చూపించాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular