Monday, January 20, 2025
HomeTrending Newsఆయిల్ ఫాం సాగుతో లాభాలు

ఆయిల్ ఫాం సాగుతో లాభాలు

యాసంగి వరిపై మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ విధానాలతో ప్రత్యామ్నాయ పంటల వైపు సగటు రైతు దృష్టి సారించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ అంశంపై రైతులకు మార్గదర్శకంగా ఉండేందుకు వారికి భరోసా కల్పించే విదంగా సొంతంగా చొరవ చూపుతున్నానన్నారు. కరీంనగర్ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇంతకాలం వరి పండించిన పొలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు మంత్రి సిద్దమౌతున్నారు. ఈ రోజు పనులకు మంత్రి గంగుల స్వయంగా శ్రీకారం చుట్టారు, వ్యవసాయ అధికారుల సలహాల మేరకు ఆయిల్ ఫామ్ సాగుకు అనువుగా భూమిని సేధ్యం చేసారు. కరీంనగర్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పెంచెందుకు లోహియా కంపెనీని ప్రభుత్వం నియమించిందని, రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించడం మొదలు కోత అనంతరం గెలలు తీసుకునే వరకూ ఆ కంపెనీ అండగా ఉండి బాధ్యతలు నిర్వహిస్తుందన్నారు మంత్రి. కోతుల బెడద లేకుండా, చీడపీడల బెడద తక్కువతో సాగయ్యే ఆయిల్ ఫామ్ చెట్లను తొమ్మిది మీటర్లకు ఒక మొక్క చొప్పున ఎకరాకు దాదాపు 57 మొక్కల ద్వారా 10టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు 10వేల ధర వచ్చే అవకాశం ఉందని, అన్ని ఖర్చులు పోనూ ఎకరాకు 70 నుండి 80వేల ఆధాయాన్ని పంటకు వస్తుందన్నారు.

ప్రతీ ఏడాది లక్షకోట్ల రూపాయల విలువైన ఆయిల్ని ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. నాలుగేళ్ళ నుండి దాదాపు 40 సంవత్సరాల వరకూ దిగుబడి ఇచ్చే ఆయిల్ ఫామ్ సాగులో మొదటి ఏడు ప్రభుత్వం 26వేలు అనంతరం 5వేల చొప్పున మూడేళ్లు సబ్సిడీని సైతం అందిస్తుందన్నారు. దీనికితోడు అంతర పంటలుగా కూరగాయలు, పెసర, మినుము, కంది వంటి పప్పుదినుసుల సాగు ద్వారా రైతు ఆదాయాన్ని సైతం అర్జించవచ్చని సూచించారు మంత్రి గంగుల. కరీంనగర్ కొత్త జిల్లా రైతుల కోసం చిగురుమామిడిలో నర్సరీని సైతం అభివ్రుద్ది చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో అధిక రాబడికి ఆస్కారం ఉన్న ఆయిల్ ఫామ్ తో పాటు వరికి ప్రత్యామ్నాయమైన వాణిజ్య పంటలు, పప్పుదాన్యాలు ఇతరత్రా మార్కెట్లో అధికంగా డిమాండ్ ఉన్న పంటలను పండించి రైతు మంచి లాబాల్ని పొందాలని ఆశించారు.
కేంద్రం తన ఏకపక్ష నిర్లక్ష్య దోరణితో రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, కేంద్రంలోని బీజేపీ నేతలు తెలంగాణ రైతుల ధాన్యాన్ని సేకరించేది లేదని, వరి వద్దని అధికారికంగా చెపుతుంటే, ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం దానికి విరుద్దంగా ప్రకటనలు చేయడం శోచనీయం అన్నారు మంత్రి గంగుల. ఈ మాయ మాటల్ని నమ్మి రైతులు ఇబ్బంది పడవద్దనే టీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు.

వానాకాలం కొనుగోళ్లపై కేంద్రం స్ఫష్టంగా ప్రకటించకున్నా ధాన్యం కొనుగోళ్లు నిరంతరంగా చేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5871 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు నిర్వహిస్తున్నామని, రోజుకు లక్ష మెట్రిక్ టన్నులకు పైగా సేకరణ చేస్తూ గత ఏడాది కన్నా దాదాపు లక్ష మెట్రిక్ టన్నులు అదికంగా నిన్నటివరకూ 20.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు మంత్రి గంగుల. 3లక్షల 27వేల మందికి పైగా రైతుల వద్దనుండి 3925కోట్ల విలువగల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. రైతులకు మేలు చేయడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేయాలని ప్రోత్సహిస్తుందని, ఆయిల్ ఫామ్ కోసం ఇప్పటికే సబ్సిడీలను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చరల్ అధికారులు బండారు శ్రీనివాస్, కందుకూరు స్వాతిలతో పాటు స్థానిక నేతలు, రైతు క్షేత్రంలో పనిచేసే రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్