తెలంగాణ అవతరించిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు… కాంగ్రెస్ సర్కారు కు ప్రభుత్వపరంగా తొలి పండుగ.
దీంతో ధూమ్ ధామ్ గా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవతరణ దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పదివేల మందితో ఘనంగా నిర్వ హించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేయనుంది.
రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వేలాదిమంది ఉద్యమించినా, ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ సాధనలో గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరు ఉంది.
దీంతో తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సోనియాతోపాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని… ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపనున్నట్టు సమాచారం. అయితే ప్రభుత్వ ఆహ్వానంపై గులాబీ దళనేత ఏ విధంగా స్పందిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కెసిఆర్ నైజం పరిశీలిస్తే అవతరణ వేడుకలకు హాజరుకాక పోవచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆహ్వానాన్ని గౌరవించి విపక్ష నేత హోదాలో కెసిఆర్ హాజరైతే రాజకీయంగా ఆయన హుందాతనం ఇనుమడిస్తుందని అనుకుంటున్నారు.
కాంగ్రెస్ లో సిఎం దగ్గరి నుంచి మంత్రుల వరకు కెసిఆర్ తో ఇబ్బంది పడ్డ వారే కావటంతో గులాబీ బాస్ వస్తారా… రావటం జరిగితే తెలంగాణ సమాజానికి మంచి సందేశం వెళుతుందని విశ్లేషణ జరుగుతోంది.
-దేశవేని భాస్కర్