Saturday, January 18, 2025
HomeTrending Newsప్రతిష్టాత్మకంగా ఇళ్ళ నిర్మాణం: జేసిలతో జగన్

ప్రతిష్టాత్మకంగా ఇళ్ళ నిర్మాణం: జేసిలతో జగన్

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఇళ్ళ నిర్మిస్తున్నామని, ఇంత భారీ స్థాయిలో ఇళ్ళ నిర్మాణం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, దేశం మొత్తం మనవైపు చూస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. హౌసింగ్ పథకంపై జాయింట్‌ కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు.

మీరతా యువకులు, మంచి ప్రతిభ ఉన్నవారని ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. 17వేల లేఔట్లలో ఇళ్లను నిర్మిస్తున్నామని, వీటిలో కొన్ని మున్సిపాల్టీల సైజులో ఉన్నాయని వివరించారు. అధికారులంతా అందరికీ ఇళ్లు పథకం అమలుకోసం విశేషంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

తొలివిడతలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్ల నిర్మాణంతో ఇది పూర్తయ్యే ప్రక్రియ కాదని, మిగిలిన 12.70 లక్షల ఇళ్లు కూడా నిర్ణీత సమయాల్లోగా పూర్తిచేయాలని కోరారు. అవినీతి, పక్షపాతం లేకుండా, వివక్షతకు తావులేకుండా వారికి ఇంటి పట్టాలు అందాలని, శాచురేషన్‌ పద్ధతిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు అందించాలన్నారు. అర్హులు 100 మంది ఉంటే.. కేవలం 10 మందికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదని వ్యాఖ్యానించారు.

పేదవాడి సొంతింటికలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ఇంటి స్ధలం, ఇళ్లు నిర్మించి ఇవ్వడం ద్వారా కనీసం 5 నుంచి 15 లక్షల రూపాయల ఆస్తి వాళ్ల చేతుల్లో పెడుతున్నామని సిఎం జగన్ వివరించారు. ఇళ్లనిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మురికివాడలుగా మారొద్దని స్పష్టం చేశారు. వివిధ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇళ్లస్థలాలు, నిర్మాణం, మౌలిక సదుపాయాలు మొత్తం కలిపి సుమారు రూ.86వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. మౌలిక సదుపాయాలకే సుమారు రూ.34వేల కోట్లు ఖర్చు అవుతుందని, ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ముత్యాలరాజు, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్