కరీంనగర్ జిల్లా పెగడపెల్లి మండల మొట్ట మొదటి ఎంపీపీ గా,జడ్పీటీసీ గా , భత్కపెల్లి సర్పంచ్ గా పదవులు చేసిన క్యాస లక్షినారాయణ(68) కరోనా మహమ్మారి వల్ల చనిపోవడం చాలా బాధాకరం. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి, క్యాస లక్ష్మి నారాయణల కుటుంబాల మధ్య 1970ల్లో రాజకీయ విభేదాలు తారా స్థాయిలో ఉండేవి. పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య 1966 నుంచే గొడవలు జరిగేవి.
జీవన్ రెడ్డి కి 12 ఏళ్ల వయసులోనే ఆయన తండ్రి రామచంద్ర రెడ్డి కక్షలకు బలయ్యారు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణలకు కారణం ఏంటనే వాటిపై అనేక ఉహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. రెండు కులాల మధ్య గొడవల్లో లక్ష్మి నారాయణ కుటుంబాన్ని ఒక వర్గం పావుగా వాడుకుందని ఎక్కువగా ప్రచారంలో ఉంది. జీవన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటే లక్ష్మినారాయణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వారు. జీవన్ రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ రాగానే లక్ష్మి నారాయణ కూడా పార్టీ మారారు.
కాల క్రమంలో లక్ష్మినారాయణ అమృతసర్ వెళ్లి సిక్కు మతం స్వీకరించారు. ప్రాణ రక్షణ కోసం ఆయుధాలు వెంట ఉంచుకునేందుకే మతం మారారని అంటారు. అయితే వీటన్నింటికన్నా ఆయన వేష ధారణ అందరిని ఆకట్టుకునేది. జగిత్యాల చుట్టు పక్కల ఏ ఉరికి వెళ్ళాలన్నా గుర్రం మీద వెళ్ళేవాడు. సిక్కు వేషధారణలో ఉన్న లక్ష్మి నారాయణ ను అందరు విచిత్రంగా చూసేవారు.
1984 ఎన్నికల ప్రచారం సందర్భంగా దివంగత నేత నందమూరి తారక రామారావు జగిత్యాల రాగా ఎన్టిఆర్ ప్రజలను ఎంత ఆకర్షించారో లక్ష్మి నారాయణ కుడా ర్యాలి ముందువరసలో జనాలను ఆకట్టుకున్నారు. ఆ సమయంలోనే ఆయన వేషధారణ చూసి అందరు బొబ్బిలి పులి, బొబ్బిలి సింహం అని పిలుచుకునే వారు. తెలుగు దేశం పార్టీలో ఎక్కువ కాలం కొనసాగిన లక్ష్మి నారాయణ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరటం అనంతరం 2019 ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఎన్నికల్లో పోటి చేశారు.