ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ… కాంగ్రెస్ పార్టీలు చూడడానికి వేర్వేరుగా పనిచేస్తున్నా. రెండు పార్టీలకూ ఒకే కుటుంబంలోని వ్యక్తులు సారధ్యం వహిస్తున్నారని… రెండూ ఒకే ఒరలో ఉన్న రెండు ఖడ్గాలు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. వైసీపీ.. తన మీద ఉన్న ఆగ్రహాన్ని తెలివిగా కాంగ్రెస్ వైపు మళ్ళించేందుకు పన్నాగం పన్నుతోందని… దాన్ని గమనించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాలని, ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని పిలుపుఇచ్చారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో జరిగిన ఎన్డీయే కూటమి బహిరంగసభలో మోడీ ప్రసంగించారు.
దేశ ప్రగతి, ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీయే కూటమి పనిచేస్తోందని మోడీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చాలాకాలంగా పోరాడుతున్నారని అన్నారు. వచ్చేఎన్నికల్లో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు మైక్ మొరాయించింది. మూడు పార్టీల కూటమి పట్ల మీకున్న అత్యుత్సాహంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై మీకున్న కోపాన్ని కూడా చూపుతున్నారంటూ ప్రధాని చమత్కరించారు. జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పిఎం కిసాన్ యోజన లాంటి, పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన, ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా ఏపీలో పేదలకు అండగా నిలిచిందన్నారు.
ప్రధాని మాట్లాడిన ముఖ్యాంశాలు:
- ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం.
- నిన్ననే లోక్ సభ ఎన్నికల శంఖారావం మోగింది. ఆ వెంటనే మిమ్మల్ని ఈ సభ ద్వారా కలుసుకోవడం సంతోషంగా ఉంది.
- ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి.
- జూన్ 4 న వికసిత భారత్ కోసం. వికసిత ఆంధ్ర ప్రదేశ్ కోసం లోక్ సభలో ఎన్డీయే కూటమికి 400 దాటాలి
- కోటప్పకొండ నుంచి త్రిమూర్తుల ఆశీర్వాదం మనకు ఉంది
- ఏపీ ప్రయోజనాల పరిరక్షణకు, ఏపీ గౌరవాన్ని కాపాడడానికి ఎన్డీయే కట్టుబడి ఉంది
- ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, వెండి నాణేన్ని విడుదల చేశాం
- పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించాం
- రెండు ప్రధాన లక్ష్యాలకోసం ఏపీ ప్రజలు కృషి చేయాలి
- కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలి
- రాష్ట్రంలో ప్రజలు ఏపీ ప్రభుత్వంపై ఎంతో ఆవేశంతో, ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి
- రాష్ట్రంలో మంత్రులు ఎవరు ఎక్కువ అవినీతి చేయాలనే దానిలో పోటీ పడుతున్నారు
- గడచిన ఐదేళ్ళలో ఏపీ అభివృద్ధి కుంటుపడింది.
- ఏపీ అభివృద్ధికి కట్టుబడి పనిచేసేవారికి ఓటు వేయాలి
- రాబోయే ఐదేళ్ళల్లో ఏపీ అభివృద్ధి చేసి చూపిస్తాం అంటూ మోడీ భరోసా ఇచ్చారు.
అహంకార, అవినీత పాలన అంతమొందించదానికి మూడు పార్టీలు ఏకమయ్యాయని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మీరు ఇవ్వబోయే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని అందుకే మద్దతు, ఆశీర్వాదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒకటేనని అదే సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్యం పరిరక్షణ అని స్పష్టం చేశారు. మోడీ ఒక వ్యక్తి కాదని, దేశాన్ని విశ్వగురుగా మారుస్తున్న ఒక శక్తిగా అభివర్ణించారు. మోడీ అంటే సంస్కరణ, భవిష్యత్తు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అని… ప్రపంచం మెచ్చిన మేటి నాయకుడని కొనియాడారు.
మోడీ ప్రభుత్వం దేశాన్ని డిజిటల్ కరెన్సీ దిశగా నడిపిస్తుంటే ఏపీని మాత్రం వైసీపీ మాత్రం బ్లాక్ మనీ దిశగా నడిపిస్తోందని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా మొదలైన పొత్తు నేడు దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మరో రూపం తీసుకోబోతోందన్నారు. అయోధ్యకు రామున్ని తీసుకొచ్చిన మోడీ… రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన చిటికిన వేలు అంత రావణాసురున్ని తీసేయడం కష్టమా అంటూ ప్రశ్నించారు. శ్రీకృష్ణుడి జన్మస్థలం ద్వారక నుంచి వచ్చిన మోడీ ఈ రాష్ట్రాన్ని కాపాడతారని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు.