జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే సామాజిక సాధికారత వెలుగులు బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో నిండాయని మాజీ మంత్రి ఎం. శంకర నారాయణ అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాలను వెన్నెముక కులాలుగా, బలహీనవర్గాలను బలవంతులుగా మార్చడమే తన నినాదంగా జగనన్న ముందడుగులు వేస్తున్నారని తెలిపారు. పార్లమెంటు నుంచి జిల్లా స్థాయివరకు అనేక పదవుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల నాయకులను నియమించారని గుర్తు చేశారు.
ఉరవకొండ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. మాజీఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీమంత్రి శంకరనారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ గిరిజమ్మ తదితరులు ప్రసంగించారు.
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీనవర్గాల ప్రజలకు జగనన్న ఆత్మగౌరవం అందింఛి వారి ఆర్థికస్థాయిని కూడా పెంచారని అన్నారు. రాబోయే ఎన్నికలు పేదలకు, పెత్తందారుల మధ్య జరుగనున్నాయని, పేదల పక్షం నిలిచినా జగన్ ను మరోసారి గెలిపించుకోవడం మన బాధ్యత అంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా అమలు చేసిన పార్టీ ఇప్పటి వరకు దేశంలో ఒక్కటీ లేదని, కానీ ఒక్కటి కూడా మిగల్చకుండా, ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా ఏదో విధంగా హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు 642 హామీలిచ్చి గాలికి విడిచిపెట్టారని విమర్శించారు. 50 శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా.. పార్టీ పరంగా మరో 10 శాతం పెంచి ఇచ్చారని ప్రశంసించారు. చదువుకున్న విజ్ఞులైన వారంతా ఈ విషయాలు గమనించి విపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
రాజానగరం నియోజకవర్గంలో సామాజిక చైతన్యం ప్రతిధ్వనించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు భారీగా హాజరై జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన బహిరంగసభలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, నందిగం సురేష్, , నటుడు ఆలీ, జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు.
జక్కంపూడి రాజా మాట్లాడుతూ 2019ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం అన్నిరంగాల్లో వెనుకబడిందని, మాట ఇచ్చినట్లుగానే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మాటల నిలబెట్టుకున్నామని అన్నారు. రూ.1,158 కోట్లతో గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, పాల కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు…రూ.104 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మించామని, రూ.215 కోట్లతో గోదావరి నీటిని తాగునీటిగా మార్చి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.91 కోట్లతో తొర్రిగడ్డ డ్రెయిన్ మీద నిర్మాణం చేయబోతున్నా వివరించారు. ఎవరినీ దేహీ అని అడగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వచ్చి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని, రూ.1142 కోట్లు డీబీటీ ద్వారా మంచి జరిగిందని, 20 వేల మందికి కొత్తగా ఇళ్ల పట్టాలిచ్చామని వెల్లడించారు.