ఎట్టకేలకు వామపక్షాలకు ఒక ఆసరా దొరికింది. వెన్నముక లేని లెఫ్ట్ పార్టీలు ఎవరో ఒకరు సాయం చేయకపోతే చట్టసభల ముఖం చూడలేని దీనస్థితి. గత రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. తాజాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ – వామ పక్షాల మధ్య ఎన్నికల పొత్తు ఖరారైందని ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే ఇంతవరకు ఏ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ పొత్తులే కుదిరితే ఆయా స్థానాల్లో లెఫ్ట్ కు మంచి రోజులు వచ్చినట్టే అని చెప్పవచ్చు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, యాదాద్రి జిల్లా మునుగోడు నియోజకవర్గాలు సిపిఐ పోటీ చేసేలా…. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం, సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సిపిఎం బరిలోకి దిగేలా హస్తంతో దోస్తీ కుదిరింది. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలనుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఖమ్మం నుంచి తలపడేలా ఢిల్లీ పెద్దలు ఒప్పించారని అంటున్నారు.
కొత్తగూడెం నుంచి సిపిఐ తరపున కూనమనేని సాంబశివరావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు మీద కొత్తగూడెం ప్రజలు తీవ్రస్థాయి అసంత్రుప్తితో ఉన్నారు. బీ.ఆర్.ఎస్ అధినేత కెసిఆర్.. మరోసారి కొత్తగూడెం నుంచి వనమాకు అవకాశం ఇవ్వటం జలగం వెంకట్రావుకు ఇష్టం లేదు. ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ సెటిల్ మెంట్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో రాఘవ అకృత్యాలు చాలా వెలుగులోకి వచ్చాయి. రాఘవ వ్యవహారం, జలగం అసంతృప్తి గులాబీకి ఇబ్బందికర పరిణామమే.
మునుగోడులో చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా… మొన్నటి ఉపఎన్నికల్లో గెలిచిన బీ.ఆర్.ఎస్ కు గెలుపు అంత సునాయాసం కాకపోవచ్చు. ఈ దఫా బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సిపిఐ తరపున పళ్ళ వెంకట్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో త్రిముఖ పోరు తప్పదు. అధికార పార్టీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉదయం నుంచే నియోజకవర్గంలో కాళ్ళకు బలపం కట్టుకొని మరి తిరుగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాటికి అనుగుణంగా ఇప్పటివరకు ఆరు వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గెలుపుపై ధీమాతో నియోజకవర్గం అంతా కలియతిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. మొన్నటి ఓటమి సానుభూతి రూపంలో కలిసివస్తుందని రాజగోపాల్ రెడ్డి భరోసాతో ఉన్నారు. సుత్తి, కొడవలి సత్తా చూపుతామని సిపిఐ నేతలు ధీమాతో ఉండగా విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
భద్రాచలం నుంచి గతంలో సిపిఎం తరపున గుమ్మడి నర్సయ్య ప్రాతినిధ్యం వహించారు. సౌమ్యుడు, నిరాడంబరతకు మారుపేరైన గుమ్మడి నర్సయ్య సాదా సీదా ప్రజాప్రతినిధి. అయితే వయోభారం దృష్ట్యా ఆయన పోటీ చేస్తారా… ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆయన కుమార్తె గుమ్మడి అనురాధకు అవకాశం ఇస్తారా వేచి చూడాలి. లేదంటే మరెవరినైనా రంగంలోకి దించుతారా రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్యను ఒప్పించి మరి సిపిఎంకు ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. పోడెం వీరయ్యకు ప్రజాభిమానం ఉన్నది. ఈ స్థానం నిజంగా ఇస్తారా తేలాల్సి ఉంది. ఇక బీ.ఆర్.ఎస్ నుంచి తెల్లం వెంకట్ రావు పోటీకి దిగుతున్నారు.
మిర్యాలగూడ నుంచి సిపిఎం తరపున జూలకంటి రంగారెడ్డి పోటీ చేయటం ఖాయం అనే చెప్పవచ్చు. ప్రజల మనిషిగా పేరున్న జూలకంటి రంగారెడ్డి… ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కర్ రావుతో తలపడనున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున జానారెడ్డి కుమారుల్లో ఒకరిని పోటీకి దించాలని చూసినా పొత్తుల్లో సిపిఎంకు దక్కిందని అంటున్నారు. వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. చైతన్యానికి మారుపేరుగా చెప్పుకునే మిర్యాలగూడ ప్రాంత ప్రజలు ఎవరికీ పట్టం కడుతారో చూడాలి.
కాంగ్రెస్ – వామపక్షాల పొత్తు ద్వారా అసెంబ్లీకి ఖచ్చితంగా ఒకరిద్దరు లెఫ్ట్ నేతలను పంపేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. శాసనసభలో బిజెపి, కాంగ్రెస్ పార్టీల ప్రాతినిధ్యం ఉన్నా… ప్రజా గళం వినిపించే పార్టీలు లేవనే ప్రచారం ఉంది. విధానాల పరంగా వామపక్షాలు ప్రజగొంతుకలు అని నిర్వచించ లేము కానీ… ఆ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ప్రజల తరపున గర్జించే తుపాకులే. కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోతే లెఫ్ట్ పార్టీల భవితవ్యం ఏంటో ఉహించలేని పరిస్థితి నెలకొంది.
వామపక్షాలతో జట్టు కట్టడం ఖచ్చితంగా కాంగ్రెస్ మేలు చేస్తుంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో లెఫ్ట్ ఓటరు కాంగ్రెస్ కు సహకరిస్తారు. దీంతో కాంగ్రెస్ అధికార పీఠానికి చేరువయ్యేందుకు… పొత్తులు ఉభాయతారకమనే చెప్పాలి.
-దేశవేని భాస్కర్