Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవార్తా వ్యాపారం

వార్తా వ్యాపారం

Media Also: తరతరాలుగా మీడియా వ్యాపారంలో ఉన్నవాళ్లేమో అంతులేని నష్టాలతో నెత్తిన గుడ్డ వేసుకుని మాయమైపోతున్నారు. దశాబ్దాలుగా అగ్రశ్రేణి వ్యాపారంలో ఉన్నా… ఏనాడూ మీడియా మొహం చూడని వాళ్లేమో మీడియా వ్యాపారాల్లో చొచ్చుకుపోతున్నారు.

డిజిటల్ విప్లవం తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రింట్, టీ వీ మీడియాల ప్రభ తగ్గుతూ వచ్చింది. గొప్ప గొప్ప మీడియా సంస్థలు కూడా తప్పనిసరిగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చాయి. షేర్లు, లైకులు, ఫాలోయర్లు, సబ్స్క్రిప్షన్లు, పే పర్ యూజ్ లు, యాప్ లతో డిజిటల్ మీడియా దానికదిగా మరో ప్రపంచం.

చేతిలో పేపర్ పట్టుకుని చదివే రోజులు క్రమంగా కనుమరుగవుతాయి. చదివినా, విన్నా, చూసినా అంతా డిజిటల్ ఫార్మ్ లోనే ఉంటాయి. ఇందులో మంచి- చెడుల చర్చ ఇక్కడ అనవసరం.

మీడియా సంస్థల నిర్వహణలో సంప్రదాయ శైలికి ఎప్పుడో కాలం చెల్లింది. విలువలు, ప్రమాణాలు, ఆదర్శాలు, అభ్యుదయాలు పాత చింతకాయ పచ్చళ్లు. మీడియాలో ఇప్పుడంతా మసాలాలు, ఇతరేతర రుచులు కలిపినవే ప్రియమయిన పచ్చళ్లు.

రాజకీయాలను మీడియా శాసించగలుగుతోంది అని తెలిసిన తరువాత…రాజకీయమే మీడియా వ్యాపారంలోకి దిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ మీడియా ఏ పార్టీ వారిదో ఇప్పుడు పాఠకులకు, ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. మీడియాలో నిష్పాక్షికత బ్రహ్మ పదార్థం.

వేల, లక్షల కోట్ల సంపదతో తులతూగే వ్యాపార దిగ్గజాల కన్ను ఆలస్యంగా మీడియా మీద పడింది. ఏ పార్టీ రూలింగులో ఉన్నా…తమను, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని భద్రంగా రక్షించుకోవడానికి మీడియా ఒక రక్షణ కవచంలా పని చేస్తుందన్నది వారి అవగాహన. అడపా దడపా మీడియాలో కనపడితేనే ఇంత కిక్కు వస్తోంది…అలాంటిది మనమే మీడియాను కొని నిత్యం మన డబ్బా మనమే కొట్టుకుంటూ ఉంటే…ఆ కిక్కే వేరప్పా! అని మీడియాలోకి దిగుతున్న వ్యాపారుల కీర్తి కాంక్ష కూడా అర్థం చేసుకోదగ్గదే.

తెలుగు మీడియా రంగంలో ఏ వ్యాపారి ఏ మీడియాలో భాగస్వామిగా, ఇన్వెస్టర్ గా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఎవరి అవసరాలు, ప్రయోజనాలు, దూరదృష్టి వారివి.

ముఖేష్ అంబానీ దేశవ్యాప్తంగా అనేక భాషల్లో, అనేక మీడియా ప్లాట్ ఫార్మ్స్ ను ఎప్పుడో కొనుగోలు చేశారు. ఆయనను దాటిపోవాలని ఆరాటపడుతున్న అదానీ  కూడా ఆలస్యంగా అదే దారిలో ఉన్నారు. దేశంలో ప్రాంతీయభాషల్లో అనేక పత్రికలు, టీ వీ లు, రేడియోలు, డిజిటల్ మీడియాలను కొనడానికి అదానీ ఒక ప్రత్యేక దుకాణాన్ని తెరిచారు. కొనుక్కునే ఆసామి ఉంటే అమ్ముకునే ఆసాములు ఉండనే ఉంటారు. వారంతా అప్పుడే అదానీని కలిసి తమ తమ మీడియా సంస్థలను ఫలానా ఫలానా రేట్లకు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నామని సెలవిచ్చారట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే…
ఇకపై భారతదేశంలో వార్త చెబితే ముఖేష్ అంబానీ చెప్పాలి. లేదంటే అదానీ చెప్పాలి. వారు చెప్పకుంటే వార్తే లేదు. వారు చెప్పనిది వార్తే కాదు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :  

పేద భారతం

Also Read :

సంసారాల్లో డిజిటల్ చిచ్చు

RELATED ARTICLES

Most Popular

న్యూస్