Sunday, April 14, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసంసారాల్లో డిజిటల్ చిచ్చు

సంసారాల్లో డిజిటల్ చిచ్చు

Effects of Social Media on Marriage and Family :

దినపత్రికల జోనల్ పేజీలు, క్రైం కాలమ్స్ చూస్తే రోజూ ఎన్నో నేరాలు, ఘోరాలు కంటికి కనిపించనంత చిన్న వార్తలుగా ఉంటాయి. అలా మరీ చిన్న వార్త కాకుండా, ఈరోజు “భార్యతో మనస్పర్ధలు…వ్యక్తి ఆత్మహత్య” అన్న వార్త కొంచెం వివరంగానే ఉంది. వార్త సారాంశమిది.

హైదరాబాద్ నగరంలో బి హెచ్ ఈ ఎల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగి. మౌలాలికి చెందిన అమ్మాయితో పెళ్లయ్యింది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. పెళ్లికి ముందు, పెళ్లయ్యాక కూడా టిక్ టాక్ వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తూ ఉండేది. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం మీద ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయి. పిల్లలు పుట్టలేదని మరో గొడవ. చివరికి చినికి చినికి గాలి వాన అయ్యింది. అయినా ఆమె వీడియోలు ఆపలేదు. మొన్న ఒక రోజు భార్యను పుట్టింట్లో దించి వచ్చి, భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇప్పుడు ఆమె వీడియోలు ఆపుతుందో, చేస్తూనే ఉంటుందో ఆమె ఇష్టం. దీన్ని ఇద్దరి మధ్య గొడవగా కాకుండా మొత్తం సమాజం అనుభవిస్తున్న సంఘర్షణగా చూస్తే కొందరయినా జాగ్రత్త పడవచ్చు.

ఈ ఆత్మహత్యలో పిల్లలు కలగకపోవడానికి సోషల్ మీడియా పాత్ర కూడా ఉండి ఉండవచ్చు. లేకపోవచ్చు. కానీ- గొడవలు మొదలయ్యింది మాత్రం అక్కడే. ఎవరి స్వేచ్ఛ వారిదయిన ఈరోజుల్లో నువ్ పోస్ట్ పెట్టు, నువ్ పెట్టకు అని నియంత్రించడానికి వీల్లేదు. పెళ్లికి ముందే సోషల్ మీడియా ఆసక్తి, అవగాహన, అభినివేశం, ఫాలోయర్స్, లైకుల సంఖ్య, షేర్ వ్యాల్యూల గురించి ఒక మాట అనుకోవడం మంచిది. పెళ్లి ముహూర్తం, మండపం, మేళతాళాలు, బఫే, వీడియోల కంటే ఇది ముఖ్యం.

కుల గోత్రాలు, జాతకాలు, తారాబలం కుదిరినా కుదరకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. పెళ్లికి తీరయిన ముక్కు మొహం ఉన్న ఫేస్ ల కంటే ఫేస్ బుక్ ఫేస్ వ్యాల్యూ, పోస్టింగుల వేగం, టెక్స్ట్ నైపుణ్యం, ఇమేజ్ మార్ఫింగ్ మెళకువలు, వీడియోల్లో సృజనాత్మకతలు పెళ్లికి ప్రాతిపదిక కావాలి.

నిశ్చయ తాంబూలాలప్పుడు తెల్ల కాగితానికి నాలుగు వైపులా పసుపు పెట్టి అమ్మాయి- అబ్బాయి పెళ్లి ముహూర్తం ఖరారు చేస్తున్నప్పుడే లీగల్ గా సోషల్ మీడియా అగ్రిమెంటు కూడా ఒకటి రాసుకుని, దగ్గర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇరు పక్షాలు సంతకాలు చేసి, సాక్షుల సంతకాలు కూడా చేయించడం ఉత్తమం.

పెళ్లి సంబంధాల ప్రకటనల్లో కూడా ఫలానా కంపెనీలో పనిచేసే అందమయిన, చదువుకున్న, ఆస్తిపాస్తులు కలిగి, ఇరవై నాలుగు గంటలూ సోషల్ మీడియాలో తప్ప బయట బతకడం తెలియని అమ్మాయి/అబ్బాయికి తగిన సంబంధం కావలెను- అని స్పష్టంగా అడగాలి. భవిష్యత్తులో రోజుకు ఇరవై అయిదు గంటలు సోషల్ మీడియాలోనే మునిగి తేలినా ఏమీ అనుకోని అమ్మాయి/అబ్బాయి కావలెను- అని ముందు చూపుతో షరతు కూడా పెట్టుకోవచ్చు.

మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్.
సేమ్ మ్యారేజెస్ ఆర్ బ్రోకెన్ ఇన్ డిజిటల్ హెల్. గో టు హెల్!

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్