ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులుంటారంటారు. అలా కొందరి విషయంలో జరుగొచ్చేమో…? అలా జగమెరిగిన సందర్భాలూ ఎన్నో విదితమే.
కానీ మనుషులను పోలిన మనుషులను కూడా.. ఒక్క ప్రాణం పోయలేకపోవచ్చునేమోగానీ.. మైనం ముద్దలతో ఏర్పాటు చేయలేని రీతిలో ప్రతిసృష్టి చేస్తున్న రోజుల్లో… రోబోటిక్ టెక్నాలజీతో మనిషి చేసే పనులన్నీ చేయిస్తున్న కాలంలో ఇక దేన్నైనా డూప్లికేట్ చేయవచ్చనే విషయం మాత్రం తేటతెల్లమైంది.
అందుకే నకిలీ నోట్లు, నకిలీ సబ్బులు, నకిలీ తాళంచేతులు, అసెంబుల్డ్ కంప్యూటర్లు, నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ పాస్ బుక్స్, నకిలీ డాక్యుమెంట్స్, నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఇలా అన్నీ సేమ్ టూ సేమ్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి కంపెనీల పేర్ల మీద ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి.
ముఖ్యంగా మానవ సమాజం రోజురోజుకూ అందుకుంటున్న నూతన సాంకేతికత ఎంత లాభమైతుందో తెలీదుగానీ… అంతే ప్రమాదాలను కూడా ఈ సమాజం ముందుంచుతుంది. అందుకు ఈ మధ్య పుట్టుకొస్తున్న సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఓ ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈమధ్య ఫేస్ బుక్ అకౌంట్లను విచ్చలవిడిగా హ్యాక్ చేస్తూ ఫేక్అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు ఫేక్ గాళ్లు. ఇవాళ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లుంటారేమోగానీ… ఫేస్ బుక్ అకౌంట్ లేనివాళ్లు మాత్రం కనిపించని రోజుల్లో… ఇంక బ్యాంక్ అకౌంట్లతో ఏంపని… ఫేస్ బుక్ అకౌంటైతే ఐపాయె అనుకుంటున్నట్టున్నారు ఫేక్ గాళ్లు.
అందుకే సామాన్యుల నుంచి వీఐపీలు, వీవీఐపీల వరకూ ఫేక్ ఐడీలు పుట్టుకొస్తున్నాయి. సామాన్యులైతే ఒక లెక్క… వీఐపీలైతే ఇంకో లెక్క అన్నట్టుగా ఫేక్ ఐడీలు పుట్టించి… మెస్సేంజర్స్ ద్వారా తనకు ఆ డబ్బు సాయం చేయకపోతే ఈ భూప్రపంచమే మునిగిపోతుందేమోనన్నంత సానుభూతిని పొందేలా మెస్సేజ్ చేస్తూ డబ్బులు కొల్లగొట్టే యత్నానికి శ్రీకారం చుట్టారు.
ఈ మధ్యకాలంలో పలువురు ప్రముఖులు కూడా అదే ఎఫ్బీ వేదికగా తమ అకౌంట్స్ హ్యాకైనట్టు… ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కొందరు సైబర్ నేరగాళ్లు డబ్బులడుగుతున్నట్టుగా కూడా తమ ఒర్జినల్ ఎఫ్బీ అకౌంట్ల ద్వారానే తమ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవాళ్లకూ… తమ ఫాలోవర్స్ నూ హెచ్చరిస్తున్న దాఖలాలు కొల్లలు.
అయితే ఈక్రమంలో స్వయానా ఓ మంత్రి అకౌంట్ ను కూడా ఫేక్ గాళ్లు హ్యాక్ చేసి… ఫేక్ చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాదు కాదు అధికారపార్టీ కార్యకర్తలు, సదరు మంత్రి అనుచరులే మిగిలినవారిని అప్రమత్తం చేసేందుకు పోస్టింగ్స్ చేస్తున్నారు.
సంక్షేమశాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫేస్ బుక్ ఐడీని క్రియేట్ చేసి… ఓవ్యక్తిని మెస్సేంజర్ ద్వారా 12 వేల రూపాయలడిగినట్టు… సదరు వ్యక్తి కూడా ఏకంగా సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే తనను డబ్బులడుగుతుండటం… అందులోనూ కేవలం 12 వేల రూపాయలు.. అవసరమైతే అప్పైనా తెచ్చిద్దామనే ఉత్సాహంలో సదరు అవతలి వ్యక్తి అత్యుత్సాహాన్ని కనబర్చడం కూడా ఆ మెస్సేజుల్లో దృగ్విదితమవుతోంది.
అయితే ఏకంగా ఓ రాష్ట్ర మంత్రి తనను 12 వేల రూపాయలడగటమేంటన్న కామన్ సెన్స్ సదరు అవతలి వ్యక్తికి ఆ సమయాన పనిచేసిందా, లేదా అన్నదైతే ఆ సోషల్ మీడియా పోస్టుల్లో కానరావడంలేదుగానీ… ఫేక్ గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పడానికి మంత్రి గారి అకౌంట్ కూడా ఫేక్ క్రియేట్ చేయడంతో మరోసారి తేటతెల్లమైంది.
సో నిత్యం తెల్లార్లేస్తే రాత్రి పడుకునేదాకా మోబైల్ చేతుల్లో లేందే రోజు గడవని… సోషల్ మీడియా చూడని రోజును కాలాన్నంతా వృధా చేసుకున్నట్టుగా భావించే వాళ్లంతా… తస్మాత్ జాగ్రత్త!
సోషల్ మీడియాలో ఉండటమే కాదు… మనకు తెలువకుండానే… మన ప్రమేయం లేకుండానే… మనలాగా యాక్ట్ చేస్తూ మనల్ని బర్బాత్ చేసే ఫేక్ గాళ్ల కాలమిదని గమనించాల్సిన సమయమిది.
-రమణ కొంటికర్ల