ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంటే ప్రైవేట్ స్కూల్స్ లో చేసేవారికి ఒకింత అసూయగానే ఉంటుంది. ఆ జీతాలు, సెలవులతో పోటీపడలేం అని నిట్టూరుస్తూ ఉంటారు. పైగా పని కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. టీచర్ అనేకాదు, ఇతర ఉద్యోగాల్లో కూడా ప్రైవేట్ కన్నా ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఎక్కువ భద్రత. అందుకే ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్.
అదే ప్రైవేటు ఉద్యోగాలంటే పని ఎక్కువ. అంతగా గుర్తింపు ఉండదు. దీనికి భిన్నంగా ఈ మధ్య కొన్ని సంస్థలు తమ వద్ద ఎక్కువకాలం పనిచేసిన ఉద్యోగులను చక్కగా గుర్తించి గౌరవిస్తున్నాయి. ఆ మధ్య ముఖేష్ అంబానీ తనదగ్గర ఎన్నో ఏళ్లుగా పనిచేసిన ఉద్యోగికి కోట్ల విలువ చేసే భవనం ఇచ్చారని విన్నాం. అదే బాటలో తాజాగా తమిళనాడులో ఒక స్కూలు యాజమాన్యం తమ దగ్గర 25 ఏళ్ళు పని చేసిన ఉపాధ్యాయుడికి 60 లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టించింది. ఆ ఉపాధ్యాయుడి రిటైర్మెంట్ సందర్భంగా ఇంటి తాళాలు అందజేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కాంచీ పురానికి చెందిన శరవణన్ అనే ఉపాధ్యాయుడు సమీపం లోని ఒరిక్కాయ్ అనే ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ లో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆరు నుంచి పదో తరగతి పిల్లలవరకు ఫిజిక్స్ బోధిస్తారీయన.

శరవణన్ నిజాయతీ, పిల్లల భవిష్యత్తు పట్ల తపన, అంకితభావం గుర్తించిన పాఠశాల యజమాని అరుణ్ కుమార్ ప్రత్యేక బహుమతితో గౌరవించాలనుకున్నారు. గురువిమలై ప్రాంతంలో 60 లక్షల ఖర్చుతో ఇల్లు కట్టి ఆ ఉపాధ్యాయుడికి అందించారు. ఊహించని ఈ బహుమతికి శరవణన్ ఆశ్చర్యానందాల్లో మునిగిపోయారు. శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశాక శరవణన్ ఇంటి తాళాలు అందుకున్నారు. ఇంత అభిమానంతో తమ ఉపాధ్యాయుడిని గౌరవించిన అరుణ్ కుమార్ ను అందరూ అనేక విధాల మెచ్చుకుంటున్నారు. ముందు ముందు ఈ విధంగానే ఎక్కువకాలంగా తమవద్ద పనిచేస్తున్న ఇతర టీచర్లకూ రానున్న కాలంలో ఇల్లు కట్టించి ఇస్తామని ప్రకటించి తమ మంచి మనసు చాటుకున్నారు అరుణ్ కుమార్.
-కె.శోభ

