Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Big Fat Indian Weddings during Pandemic :

పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయనేది పాత మాట.
ఇక్కడే స్వర్గం సృష్టిస్తామనడం నయా ట్రెండ్..

ఓ అందమైన కరోనా సాయంకాలం.. కాలింగ్ బెల్ మోగింది. అనుమానంగా తలుపు తీస్తారు. చక్కటి యూనిఫారంలో మాస్క్, గ్లోవ్స్ వేసుకున్న ఇద్దరు యువకులు విష్ చేస్తారు. ఫలానా వాళ్ళు పెళ్లి సందర్భంగా పంపించారని పెద్ద బాక్స్ ఇస్తారు. తీరా ఆ బాక్స్ తెరవగానే – వెండి,బంగారు పువ్వులు,పట్టు వస్త్రాలు,నోరూరించే స్వీట్స్ , మనకు నచ్చే పెర్ఫ్యూమ్ ఉంటాయి. మనసంతా ఆనందంతో నిండి పోతుంది కదూ! అప్పటినుంచీ ఇక ఆ వధూవరులను ఆశీర్వదిస్తూనే ఉంటారు. అదే ఇప్పటి ట్రెండ్..

కరోనా దెబ్బకి బిగ్ ఫాట్ ఇండియన్ వెడ్డింగ్ పరిశ్రమ కుదేలైపోయింది. 2016 లో అక్షరాలా మూడు లక్షల అరవై ఎనిమిదివేల కోట్ల రూపాయలున్న (చుక్కల్లో లెక్కలు కనిపిస్తున్నాయా) మ్యారేజ్ బిజినెస్ గత రెండేళ్లలో 20 శాతం తగ్గిపోయిందట. అంతేనా! అదేంటి! ఎక్కడా పెళ్లిళ్లు జరగడం లేదు. జరిగినా ఒకటీ అరా అదీ పదిమందితో అంటారా!ఆగండాగండి..అక్కడే తప్పుగా అంచనా వేశారు. ఉపాయం లేనివాళ్ళని ఊరినుంచి పొమ్మంటారు గానీ బుర్రనిండా ఆలోచనలే నిండి ఉండే వెడ్డింగ్ ప్లానర్స్ ని కాదు. పరిస్థితికి తగ్గట్టు బిజినెస్ మార్చేస్తున్నారు వీళ్ళు వందలు వేలల్లో అతిథులు, ఆకాశమంత పందిరి, కళ్ళు చెదిరే అలంకరణలు, సంగీత్, మెహందీ, హల్దీ .. ప్రీ వెడ్ షూట్, వెడ్డింగ్ షూట్ , రిసెప్షన్ …ఇలా చెప్పాలే గానీ ఎన్నో సందర్భాలు. వధూవరులకే కాకుండా చుట్టూ ఉండే బృందగానాలకు సైతం ఈవెంట్ మేనేజర్లు తళుకులు అద్దుతారు. అందుకే ఉన్నవారి పెళ్లిళ్ళంటే మీడియాకూ ప్రీతి. మరి ఈ హడావుడి ఏ మాత్రం తగ్గకుండా ఎలా చేస్తున్నారా?…

Big Fat Indian Weddings :

అతిథుల సంఖ్య తప్ప మిగిలిన ఏ ఆడంబరమూ తప్పకుండా డబ్బు ఖర్చు పెట్టడమే ఇప్పటి పధ్ధతి. అంతే కాదు, ఎంత తక్కువ టైం లో అయినా ఇవి చెయ్యచ్చంటున్నారు ప్లానర్స్. పరిస్థితికి తగ్గట్టుగా రెండు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. వివాహం ఇప్పుడు కొద్దిమందితో చేస్తున్నా ఆ ఖర్చు అతిథుల కోసం గిఫ్ట్స్, పెళ్ళికి వచ్చే కొద్ది మందికి ప్రత్యేక సౌకర్యాలు, స్వర్గాన్ని తలదన్నే అలంకరణ, థీమ్ బేస్డ్ సెలెబ్రేషన్స్ తో ముందుకుపోతున్నారు. ఇవన్నీ అందరితో పంచుకోడానికి వీడియో లింకులు, సోషల్ మీడియా ఉండనే ఉన్నాయి. ఎవర్రా అది?సోషలిజం, సింప్లిసిటీ అంటున్నది? అవన్నీ మామూలు మనుషులకి; స్వర్గాన్ని సృష్టించగల మారాజులకు కాదు.

-కె. శోభ

Read More: స్మార్ట్ ఫోన్ పౌరోహిత్యం – వైఫై వేద మంత్రాలు

Read More: సినిమా సంతానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com