Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంస్మార్ట్ ఫోన్ పౌరోహిత్యం - వైఫై వేద మంత్రాలు

స్మార్ట్ ఫోన్ పౌరోహిత్యం – వైఫై వేద మంత్రాలు

పెళ్ళంటే…?
పందిళ్లు.. తప్పట్లు
బాజాలు భజంత్రీలు
మూడే ముళ్ళు ఏడే అడుగులు
మొత్తం కలిపి నూరేళ్లు
మరో పెద్దాయన ఇలా అన్నాడు
తాళికట్టు శుభవేళ మెడలో కల్యాణమాల
మేళాలు తాళాలు మంగళవాద్యాలు
…ఇలా ఎన్ని పాటలైనా చెప్పుకోవచ్చు. కానీ పురోహితుడు లేకుండా జరిగే పెళ్లి చూశారా? ఆ మాట కొస్తే ఏ మతంలో అయినా పెళ్లి జరిపించడానికి ఒకరు ఉంటారు.

హిందూ పెళ్లిళ్లలో పురోహితుడు లేని పెళ్లిళ్లు ఉండవు. ఆయనగారు మాంగల్యం తంతునానేనా అన్నాకనే కదా ఆఫీషియల్ గా భార్యాభర్తలని గుర్తింపు వచ్చేది. కానీ ఇప్పుడున్నది కరోనాకాలం. కలికాలం కన్నా ఘోరం. ముహుర్తాలు మించిపోతున్నాయి.

అనుకున్న టైంకే పెళ్లి జరగాలని ఆత్రుత. ప్రాణభయంతో పెళ్లి తంతు జరిపించలేమని పంతుళ్లు..రకరకాల కథలు..అయితే ఉపాయం లేనివాళ్ళని ఊరిలోంచి తరిమేయాలని సామెత. అంత బాధ లేకుండా ఒక ఊరిలో ఏం చేసారో చూద్దాం..

మెదక్ జిల్లా పాపన్న పేటలో ఒక వివాహం జరగాలి. బంధుమిత్రులు,అలంకరణలతో హడావుడిగా ఉంది. అయితే వివాహానికి వచ్చినవారిలో ఒకరు కరోనా బారిన పడి మరణించారని తెలిసింది. దాంతో పురోహితుడు దిగంబర శర్మ తాను వచ్చి వివాహం జరిపించడం కష్టమని,కావాలంటే ఫోన్ లో వీడియో కాల్ ద్వారా జరిపిస్తానని చెప్పాడు.

ఎలాగోలా పెళ్లి జరిగితే చాలనుకున్న వాళ్ళకి ఈ ఐడియా నచ్చింది. వెంటనే మైక్ లో మంత్రాలు వినపడేలా ఏర్పాట్లు చేసారు.
…అలా మన దిగంబర శర్మగారు తన వినూత్నమైన ఆలోచనతో తాళికట్టు శుభవేళ సెల్లు తెరపై వధూవరులను వీక్షిస్తూ వేదమంత్రాలతో వివాహం జరిపించారు. దానితో అందరూ పురోహితుడిని మెచ్చుకున్నారు. మరి సంభావన పే టీఎం లో ఇచ్చారేమో!శుభం భూయాత్ !

-కె. శోభశ్రీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్