కందుకూరులో ఇటీవల జరిగిన ఘటన దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల భద్రతకోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిబంధన జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లు, మార్జిన్లకు వర్తిస్తుంది.
సభలు, ర్యాలీలకు ప్రత్యామ్నాయంగా , రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన ప్రదేశాలను ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. అధికారులు ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించింది.
అత్యంత అరుదైన సందర్భాల్లో రోడ్లపై షరతులతో కూడిన అనుమతి ఇస్తామని, షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యల తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.