సీమ ప్రాంతానికి అన్యాయం చేసిన చంద్రబాబు కర్నూలు జిల్లాకు వచ్చే హక్కు లేదని, ఇక్కడ హైకోర్టు వస్తుంటే దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విమర్శించారు. ఇక్కడి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కావాలి గానీ, ఇక్కడకు న్యాయ రాజధాని వస్తుంటే అడ్డుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పర్యటించే అర్హత లేదని స్పష్టం చేశారు. శ్రీ బాగ్ ఒప్పందంపై ఈ ప్రాంతంలో సెంటిమెంట్ ఉందని, దీన్ని డైవర్ట్ చేయడానికే బాడుడే బాదుడు పేరుతో ఇక్కడ పర్యటిస్తున్నారని అన్నారు. చరిత్రలో రాయలసీమ ద్రోహి ఎవరు అంటే చంద్రబాబు అని ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని, అందరం కలిసి ఉండాలనే మంచి ఉద్దేశంతో సిఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వస్తే, దాన్ని అడ్డుకుంటున్నది టిడిపి కాదా అని ప్రశ్నించారు. కర్నూలులో న్యాయ రాజధానికి ఒప్పుకున్న తర్వాతే బాబు ఇక్కడ పర్యటించాలని బాబును డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు, అయన దత్తపుత్రుడికి ప్రజలు ఎప్పుడో బాదుడే బాదుడు చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా మాట్లాడడం బాబుకు అలవాటేనని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కరెంట్, వాటర్, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ పన్నులు పెంచిన చరిత్ర చంద్రబాబుదేనని, ఇన్ని పన్నులు వేసినా కనీసం ఒక్క మంచి పని కూడా ఆయన చేయలేకపోయారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా నేరవేర్చలేకపోయారని హఫీజ్ ఖాన్ అన్నారు.
సీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై నాడు పెద్దలు పోరాడితే శ్రీబాగ్ ఒప్పందం వచ్చిందని, నేటికి సరిగ్గా 85 ఏళ్ళ క్రితం ఈ ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. ఏపీ విడిపోయిన తరువాత అయినా కనీసం దీనిపై ఆలోచించకుండా అమరావతిలోనే అన్నీ సంస్థలూ పెట్టుకున్నారని హఫీజ్ మండిపడ్డారు.
Also Read : అప్పులు, ఆత్మహత్యల్లో రాష్ట్ర రైతాంగం: బాబు