Sunday, January 19, 2025
HomeTrending Newsబీఆర్‌ఎస్‌ వైపు యువత చూపు: మంత్రి జగదీశ్‌ రెడ్డి

బీఆర్‌ఎస్‌ వైపు యువత చూపు: మంత్రి జగదీశ్‌ రెడ్డి

బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను తీసేస్తుండటంతో యువత కేంద్రం తీరుపై విసుగు చెందుతున్నారన్నారని వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి జగదీశ్‌ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిన మోదీ ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, రైల్వేతో పలు పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలను అమ్మేందుకు సిద్ధంగా ఉందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మతంపేరుతో రాజకీయం చేస్తూ దేశంలో చిచ్చుపెడుతున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌ల వల్ల భారతదేశం తిరోగమనంలో పయణిస్తుందన్నారు. దేశానికి ప్రధాన ఆధారమైన వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేశారని చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో పేదలు మరింత పేదరికంలోకి వెళ్తుండగా, సంపన్నులు భారీగా సంపదను పోగేసుకుంటున్నారని విమర్శించారు. ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, అనేక సామాజిక జాఢ్యాలతో దేశం నేడు సంక్షుభితంగా మారిపోయిందని చెప్పారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీ కూడా మౌలిక పరమైన సమస్యలను పరిష్కరించడం లేదని, కనీసం ఆ దిశగా చొరవ చూపడం లేదన్నారు.

ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజలు ఆ రెండు పార్టీలకే అధికారం కట్టబెడుతూ వస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి నూతన పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ రూపంలో సమర్థ నాయకత్వం లభించాయన్నారు. ప్రజల కలలను సాకారం చేసే నాయకుడు కేసీఆర్ మాత్రమేనని వెల్లడించారు. దేశంలో రైతుల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలనతో యువత, మేధావులు, సామాన్య ప్రజానీకం విసుగెత్తిపోయారని, ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అన్నిరాష్ట్రాల వారు కేసీఆర్‌ పార్టీ గురించి చర్చించుకుంటున్నారని, రాబోయే కాలంలో దేశం గొప్ప మలుపు తిరగబోతున్నదని మంత్రి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్