పరిశ్రమలకు ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉండే ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని అప్పుడే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా తాము చేపట్టిన వినూత్న పథకాలకు రామ్ కో సిమెంట్స్ యూనిట్ ఏర్పాటు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రామ్ కో సిమెంట్స్ తయారీ యూనిట్ ను సిఎం ప్రారంభించారు. ఇక్కడ లైమ్ స్టోన్ మైన్స్ వినియోగించుకొని 2 వేల మిలియన్ టన్స్ కెపాసిటీ తో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సంతోషమని సిఎం అన్నారు. త్వరలో దీని సామర్ధ్యం మరింత పెంచేందుకు యాజమాన్యం హామీ ఇచ్చిందని, దీని ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలతో పాటు, సీఎస్ఆర్ ద్వారా పరిసర గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు వీలుంటుందని వివరించారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలంటూ ఎలాగూ చట్టం చేశాం కాబట్టి ఇక్కడి యువతకే ఉద్యోగాలు వస్తాయన్నారు.
ఈ ప్రాంతంలోనే గ్రీన్ కో చేపట్టిన 5,400మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తోన్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు కొద్దిరోజుల క్రితమే శ్రీకారం చుట్టామని సిఎం గుర్తు చేశారు. రాయలసీమ ప్రాంతంలో రైతులకు మంచి జరగాలని, యువతకు ఉపాధి లభించాలని, అందుకే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందోస్ సాల్వ్, అరబిందో, అదానీ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలు 72, 188 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని, మరో నాలుగేళ్ళలో ఇవి పూర్తవుతాయని, షుమారుగా 20వేల ఉద్యోగాలు వస్తాయని వివరించారు.
రైతులు ముందుకు వస్తే ఎకరాకు ఏటా 30వేల రూపాయలు చెల్లించేలా ప్రభుత్వమే వారితో అగ్రిమెంట్ ఎంటర్ అవుతుందని, మూడేళ్ళ కోసారి 5 శాతం పెంచుతామని, బీడుగా ఉన్న ఈ భూముల్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు నెలకొల్పుతామని, ఈ విషయమై రైతులను ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని సిఎం కోరారు. అయితే ఒక లొకేషన్ లో కనీసం 1500నుంచి 2000 ఎకరాల వరకూ ఓ క్లస్టర్ గా ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.