Monday, November 25, 2024
HomeTrending NewsTelangana: చివరి రోజు సిత్రాలు...గెలుపు గుర్రాలకే టికెట్లు

Telangana: చివరి రోజు సిత్రాలు…గెలుపు గుర్రాలకే టికెట్లు

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ చివరి రోజు దగ్గర పడగానే చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఆఖరి రోజు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోగా కొందరికి మోదమైతే మరికొందరికి ఖేదం అయింది. మునుపెన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్లో గ్రూపులు కట్టే నేతలకు పాలుపోవటం లేదు. అటు బిజెపి, బీఆర్ఎస్ లు అదే దారిలో అడుగులు వేశాయి.

పటాన్ చెరువులో నీలం మధు పేరు ప్రకటించిన కాంగ్రెస్ ఆ తర్వాత కాటా శ్రీకాంత్ గౌడ్ కు బీఫాం ఇచ్చింది. జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహల మధ్య తగాదాగా కనిపించినా మొదటి నుంచి కార్యకర్తలతో ప్రజల్లో ఉన్న శ్రీకాంత్ కు ఇవ్వటం సముచితమని నాయకత్వం భావించిందని సమాచారం. రెండు రోజులుగా ఆశ నిరాశల మధ్య ఉన్న నీలం మదు చివరకు BSP అభ్యర్థిగా బరిలోకి దిగారు. 60 వేల ముదిరాజ్ ఓట్లతో గట్టెక్కుతానని భరోసాతో ఉన్నారు.

మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ బీ ఫాం ఇచ్చింది. సిపిఎం కోసం ఈ సీటు వాయిదా వేస్తూ వచ్చిన కాంగ్రెస్ చివరకు బీఎల్ఆర్ వైపు ముగ్గు చూపక తప్పలేదు. సిపిఎం నుంచి జూలకంటి రంగారెడ్డి అభ్యర్థిగా గెలిస్తే.. నా పరిస్థితి ఎంటని తమ్మినేని వీరభద్రం పట్టుబట్టి చెడగొట్టారని అంటున్నారు. ఇందుకు సీతారం ఏచూరి సహకరించారని వినికిడి. మరోవైపు తన అనుచరుడి గెలుపు కోసం జానారెడ్డి చాలా మంత్రంగామే చేశాడని టాక్. పొత్తుల్లో వామపక్షాలకు ఇస్తే భాస్కర్ రావు గెలుపు సులువని.. బీఎల్ఆర్ కు టికెట్ రాకుండా జానారెడ్డి యత్నించారని అంటారు. ఇప్పటిదాకా గెలుపు ఖాయమని  బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్ రావు ధీమాగా ఉన్నారు. ఇప్పుడు బీఎల్ఆర్ రూపంలో పెద్ద గండమే ఉంది.

సూర్యాపేటలో ఎప్పటిలాగే రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిల మధ్య ఉగిసలాడినా దామోదర్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. దీంతో కోమటి రెడ్డి అనుచరుడు మందుల సామేలుకు తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ఫైనల్ అయింది. రెండుసార్లు బోటా బోటీ మెజారిటితో గెలిచిన గ్యాదరి కిషోర్ కు ఈ దఫా తిప్పలు తప్పవు. కిషోర్ మాల, సామేలు మాదిగ వర్గానికి చెందిన వారు. ఈ నియోజకవర్గంలో మాదిగ ఓట్లు అధికం.  వాస్తవం తెలుసు గనుక అద్దంకి దయాకర్…పార్టీ నిర్ణయమే శిరోధార్యమని హందాగా వ్యవహరించారు.

వేములవాడలో ఈటెల వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా సాగింది. ఈటెల రాజేందర్ వర్గంలో మొదటి నుంచి కీలకంగా ఉన్న తుల ఉమ పేరు వేములవాడ బిజెపి అభ్యర్థిగా ప్రకటించారు. చివరకు పార్టీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ కు ఖాయం చేశారు. బిజెపి, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం కావటంతో ఎన్నాళ్ళ నుంచొ వేచి చూస్తున్న విజయం తనదే అని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఖుషీగా ఉన్నారు. తుల ఉమ బరిలో ఉంటె రెండు మూడు మండలాల్లో కాంగ్రెస్ కు గండిపడేది. ఎమ్మెల్యే పదవి కోసం దండయాత్రలు చేస్తున్న ఆది శ్రీనివాస్ కు ఈ దఫా సానుబూతి, బీసీ అంశాలు కలిసివచ్చే అవకాశం ఉంది.

ఆలంపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరు ప్రకటించినా.. ఆఖరులో విజయుడికి బీఆర్ఎస్ బీఫాం ఇచ్చారు. ఈయన పేరు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి ప్రతిపాదించారనేది బహిరంగ రహస్యం. అబ్రహం పోటీలో ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ కు విజయం నల్లేరు మీద నడక అని హస్తం నేతలు భావించారు. ఇప్పుడు విజయుడి రూపంలో విజయం ఇద్దరి మధ్య దోబూచులాడనుంది.

నారాయణఖేడ్ లో మాజీ ఎంపి సురేష్ షెట్కార్ పేరు ప్రకటించి చివరి నిమిషంలో పట్లోళ్ళ సంజీవ రెడ్డికి కాంగ్రెస్ బీఫాం ఇచ్చారు. ఎన్నికలు వచ్చినపుడే సురేష్ షెట్కార్ కనిపిస్తారని… సంజీవ రెడ్డి పార్టీనే నమ్ముకుని నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉన్నారని నాయకత్వానికి వినతులు వెల్లువెత్తాయి.

ఇలా ఆఖరు నిమిషంలో మారిన అభ్యర్థుల అంశంలో లాభ నష్టాలు బేరీజు వేస్తే కాంగ్రెస్ సమయోచితంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. అయితే బీసీలకు ఇస్తానన్న 34 సీట్ల హామీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయింది. కేవలం 22 సీట్లతో సరిపెట్టింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్