రైల్వే జోన్ విషయంలో ఎలాంటి పుకార్లనూ నమ్మవద్దని, జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని పనులూ పూర్తి చేశామని, ఇప్పటికే భూమి పరిశీలన పూర్తయ్యిందని, నిర్మాణ వ్యయానికి సంబంధించిన అంచనాలు కూడా తయారు చేశామని వెల్లడించారు. వైజాగ్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయానికి సమీపంలోనే జోన్ రైల్వే ఆఫీసు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే కొంత ఆలస్యమైందని చెప్పారు. రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని భరోసా ఇచ్చారు.
విభజన సమస్యలపై నిన్న కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైల్వే జోన్ అంశంలో కేంద్రం వెనకడుగు వేసిందని, ఇక జోన్ ఉండదని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై వైఎస్సార్సీపీ, బిజెపి రాష్ట్ర శాఖలు మండిపడ్డాయి. జోన్ రాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించగా, జోన్ వచ్చి తీరుతుందని సోము వీర్రాజు చెప్పారు. మధ్యాహ్నానికి కేంద్ర రైల్వే మంత్రి దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చి జోన్ ఏర్పాటు చేయడం లేదంటూ వచ్చిన వార్తలకు తెరదించారు.
Also Read : రైల్వే జోన్ వచ్చి తీరుతుంది: సోము