Tuesday, March 17, 2026
HomeTrending Newsఉద్యానవన పంటల సాగులో తెలంగాణ టాప్ - నిరంజన్ రెడ్డి

ఉద్యానవన పంటల సాగులో తెలంగాణ టాప్ – నిరంజన్ రెడ్డి

మామిడి విస్తీర్ణంలో 3.21 లక్షల ఎకరాలతో 8వ స్థానం .. ఉత్పత్తిలో దేశంలో నాలుగవ స్థానంలో తెలంగాణ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మామిడి ఉత్పాదకతలో జాతీయ సగటు హెక్టారుకు 8.17 మెట్రిక్ టన్నులు .. తెలంగాణ సగటు 9.24 మెట్రిక్ టన్నులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలు మానుకోవాలని ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ లో హితవు పలికారు. మిరపసాగులో 3.88 లక్షల ఎకరాలతో 6.51 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలో రెండోస్థానంలో ఉన్నామని, ఉత్పాదకతలో మిరప జాతీయ సగటు 3.77 మెట్రిక్ టన్నులు .. తెలంగాణ సగటు 5.67 మెట్రిక్ టన్నులు ఉందన్నారు.

86 వేల ఎకరాలలో పసుపుసాగుతో దేశంలో రెండో స్థానం .. 2.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో 5వ స్థానంలో ఉన్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కూరగాయల ఉత్పాదకతలో జాతీయ సగటు హెక్టారుకు 18.79 మెట్రిక్ టన్నులు .. తెలంగాణ సగటు 24.77 మెట్రిక్ టన్నులని వివరించారు. ఆయిల్ పామ్ సాగులో 20 లక్షల ఎకరాలలో సాగు లక్ష్యంగా ఈ ఏడాది చివరి వరకు విస్తీర్ణంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరుకోనున్నదన్నారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఇప్పటికే 3.61 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలో రెండోస్థానంలో ఉన్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుబంధు, రైతుభీమా, సాగునీరు, ఉచిత కరంటు, సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ, ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహంతో  రైతాంగం అద్భుతాలు సాధిస్తున్నదన్నారు.

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ప్రకారం వైవిధ్యమైన పంటల సాగుతో  లాభాలు సాధించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. ప్రజలకు పోషకభద్రత పెంచడానికి ఉద్యానసాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తోందని, రాబోయే కాలంలో రానున్న పంట ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకుని కోహెడ మార్కెట్ లో 200 ఎకరాలలో అత్యాధునిక వసతులతో పండ్ల మార్కెట్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఎగుమతులకు అనుగుణంగా వేపర్ హీట్ ట్రీట్ మెంట్ ప్లాంటు, ఇర్రేడియేషన్ ప్లాంటు మరియు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయనున్నారని, పోషక అవసరాలకు అనుగుణంగా నెలవారీ డిమాండ్ మేరకు కూరగాయల సాగుకు చర్యలు చేపడతామన్నారు.

డిమాండ్ కు తగిన విధంగా రైతులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు అనుకూల విధానాలను అవలంబించాల నిరంజన్ రెడ్డి కోరారు. పేరుకు కేంద్రం వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధిని ప్రకటించినా అది ఆచరణాత్మకంగా లేదన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని, రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని .. పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేశారని విమర్శించారు. 60 ఏండ్లు పైబడిన రైతులకు ఫించన్ ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారన్నారు. కేంద్రం విధానాలు, నినాదాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని, రైతుల విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వానివి జూటా హామీలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Also Read : కేంద్ర వ్యవసాయ విధానం అస్తవ్యస్తం మంత్రి నిరంజన్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular