Ukraine Medical Students: ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్ధులను ఇక్కడి మెడికల్ కాలేజీల్లో చేర్పించి వారి విద్యను కొనసాగించే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్ సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయన ఈ విషయాన్ని నేడు లోక్ సభ జీరో అవర్ లో ప్రస్తావించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వేలాదిమంది ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్నారని , వారంతా నిరుపేద కుంటుంబాలకు చెందిన వారని సభ దృష్టికి తీసుకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారందరినీ ఇక్కడకు తరలించారని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవని మిథున్ రెడ్డి అభినందించారు. అయితే అక్కడ సాధారణ స్థితి ఎప్పటికి నెలకొంటుందో తెలియని పరిస్థితి ఉందని, వారి విద్య డోలాయమానంలో పడిందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని, వారి విద్యని మనదేశంలోని వివిధ విద్యాసంస్థల్లో రీలోకేట్ చేసేవిధంగా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. వైద్య విద్య కోసం మన విద్యార్ధులు విదేశాలకు వెళ్ళే అవసరం లేకుండా దేశంలోనే మెడికల్ కాలేజీల సంఖ్య ను పెంచాలని కేంద్రానికి సూచించారు.