రాష్ట్రానికి మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, మోడీ కంటే ముందు ఈడీ రావడం సహజమని, ఈడీ, సీబీఐతో భయపెట్టించి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందంటూ వార్తలు రావటం…సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఈ రోజు ఉదయం నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో కవిత హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈడీ వస్తే కచ్చితంగా సమాధానం చెప్తామని, మీడియాకు లీకులు ఇచ్చి రాజకీయం చేస్తున్నారని కవిత మండిపడ్డారు.
జైల్లో పెడతామంటే పెట్టుకోండి అని కవిత సవాల్ చేశారు. అంత కంటే ఏం చేయగలరని, మోడీ 8 ఏళ్ల పాలనలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చింది బీజేపీ అని ఆరోపించారు. దేశంలోకి బీజేపీ పాలన వచ్చి ఎనిమిది ఏళ్ళు పూర్తి అయిందని, మోడీ వచ్చే ముందు ED రావడం సహజమని, వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ED కేసులతో బెదరగొట్టాలని చూస్తున్నారని అన్నారు. రాజకీయపరమైన ఎత్తుగడలో భాగంగానే ED కేసులు పెడుతున్నారని, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతియ్యడానికే మీడియా లీకులని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయించడం, బీజేపీ నీచ రాజకీయ ఎత్తుగడ అన్నారు. జైల్లో పెడతాం అంటే భయపడం…జైల్లో పెడితే ఏం అవుతుందని కవిత ప్రశ్నించారు. జైల్లో పెట్టి ఉరి వెయ్యరు కదా..!అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతామని, ఈడీలకు, సీబీఐలకు భయపడేది లేదని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు.