మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఈ రోజు ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి గత కొంత కాలంగా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.
గతంలో ఈ నియోజకవర్గం నుండి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఐదుసార్లు గెలుపొంది తిరుగులేని నేతగా ఎదిగారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె అయిన పాల్వాయి స్రవంతి కూడా నియోజకవర్గంలో అంతే ప్రాధాన్యత ఉన్నట్టు కాంగ్రెస్ సర్వేలో వెల్లడైంది. మరో నేత చల్ల కృష్ణారెడ్డి పోటీ పడినా అధిష్టానం స్రవంతి అభ్యర్తిత్వాన్నే ఖరారు చేసింది. పార్టీ సర్వేల్లో పాల్వాయి స్రవంతికి వచ్చినంత ఓట్లు చల్లా కృష్ణారెడ్డి కి కూడా వచ్చాయని, అయినప్పటికీ పాల్వాయి స్రవంతి ముందు, ఆయన ప్రాధాన్యత రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.
2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించడంతో స్రవంతి స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకున్నారు. కోమటిరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఈ పరిణామమే సర్వేలో పాల్వాయి స్రవంతికి కలిసివచ్చినట్లు సమాచారం.
Also Read : విమోచన పేరుతో మత కల్లోలాలకు కుట్ర – రేవంత్ ఆరోపణ