Tuesday, September 17, 2024
HomeTrending NewsMunugodu Politics: ఎల్ బి నగర్ పై రాజగోపాల రెడ్డి నజర్?

Munugodu Politics: ఎల్ బి నగర్ పై రాజగోపాల రెడ్డి నజర్?

బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజులుగా మౌనంగా ఉండటం కమలం పార్టీలో చర్చనీయంశంగా మారింది. కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి బిజెపిలోకి వచ్చాక కొంచెం సంయమనం పాటిస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్నంత వాక్ స్వాత్రంత్రం ఇక్కడ లేకపోవటం కారణం అయి ఉండవచ్చు. అయితే ఇటీవల రాజగోపాల రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.

ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ బిజెపి..బీ ఆర్ ఎస్ ల మధ్య ఢిల్లీ స్థాయిలో ఒప్పందం జరిగి ఉండవచ్చని ప్రజలు అనుకుంటున్నారని, అందుకే లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేయటం లేదని ప్రజలు అనుమాన పడుతున్నారని కామెంట్ చేశారు. దీనిపై పార్టీ నాయకత్వం స్పష్టత ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీ దెబ్బతింటుందన్నారు. ఈ కామెంట్ బిజెపి శ్రేణులను కలవర పరిచింది. ఈ అంశంలో బిజెపి పెద్దలు రాజగోపాల రెడ్డి ని సముదాయించినట్టు విశ్వసనీయ సమాచారం.

మునుగోడు ఉప ఎన్నిక జరిగిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న రాజగోపాల్ రెడ్డి ఇటీవల కొంత ఎడం పాటిస్తున్నట్టు ఆయన అనుచరులు చెపుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించటం రాజగోపాల్ రెడ్డిని మనస్తాప పరిచింది. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసిన బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ఇవ్వటంపై  కినుక వహించారు.

ఒక దశలో తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసినట్టు విశ్వసనీయ సమాచారం. రాజగోపాల్ రెడ్డి దగ్గరి అనుచరులు ఈ దిశగా ఆయనపై ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి నిర్ణయాలు రాజకీయ పతనానికి దారితీస్తాయని… రాజగోపాల్ రెడ్డి  వారిని సముదాయించారు.

రాబోయే శాసనసభ ఎన్నికలపై రాజగోపాల్ రెడ్డి కొత్త ఫార్ములాతో సిద్దమైనట్టు వినికిడి. మునుగోడు నుంచి తాను పోటీ చేసి…తన భార్య లక్ష్మిని ఎల్ బి నగర్ నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నారని తెలిసింది. అయితే బిజెపి నుంచి కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు ఇస్తారా అనేది ప్రశార్తకంగా మారింది. అవసరమైతే తానే ఎల్ బి నగర్ నుంచి రంగంలోకి దిగాలని కూడా ఆలోచిస్తున్నారని సమాచారం.

ఎల్ బి నగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా పేరాల చంద్ర శేఖర్ రావు ఇదివరకు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఎల్ బి నగర్ నుంచే పోటీ చేసి అదృష్టం పరీక్షించుకునే పనిలో బిజీగా ప్రచారం చేసుకు పోతున్నారు. అటు బీ.ఆర్.ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపి మధుయాష్కి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి నిర్ణయానికి పార్టీ నాయకత్వం ఎంతవరకు ఆమోదం తెలుపుతుందో చూడాలి. అసలు మునుగోడులో ఈ దఫా రాజగోపాల్ రెడ్డి దే గెలుపు అని అనుచరవర్గం ధీమాతో ఉండగా… రాజ్ గోపాల్ అన్న దృష్టి ఎల్ బి నగర్ మీద ఎందుకు పడిందో అని అనుచరులు వాపోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్