గుణశేఖర్ కి చారిత్రక .. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అనుభవం ఉంది. కథకి తగినట్టుగా పాత్రలు ఎలా ఉండాలి? అవి ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలపై మంచి అనుభవం ఉంది. ‘బాలల రామాయణం’ .. ‘రుద్రమదేవి’ వంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. అలాంటి గుణశేఖర్ నుంచి రావడానికి ‘శాకుంతలం’ సిద్ధమవుతోంది. మహాకవి కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు.
సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుందనగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశామనీ .. న్యూ రిలీజ్ డేట్ త్వరలో చెబుతామని ఒక లెటర్ వదిలారు. తాజాగా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుని ఎనౌన్స్ చేసేశారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చెప్పారు.
నిజానికి ఈ నెల 17వ తేదీన ధనుశ్ ‘సార్’ మినహా పెద్ద సినిమాలేవీ లైన్లో లేవు. ఆ తరువాత వారం కూడా చిన్న సినిమాలే వెయిటింగులో ఉన్నాయి. మరి అలాంటప్పుడు ‘శాకుంతలం’ సినిమా రిలీజ్ ను ఏప్రిల్ 14కి ఎందుకు వాయిదా వేశారనేది తెలియదు. గుణశేఖర్ తో పాటు దిల్ రాజు కూడా ఒక నిర్మాతగా ఉన్న ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. ఈ సినిమా తరువాత సమంత గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందనే ఆశతో .. ఆలోచనతో అభిమానులు ఉన్నారు.