Tuesday, June 16, 2026
HomeTrending Newsహైదరాబాద్ కి స్టీల్ బ్రిడ్జి తలమానికం - మంత్రి కేటీఆర్

హైదరాబాద్ కి స్టీల్ బ్రిడ్జి తలమానికం – మంత్రి కేటీఆర్

సెంట్రల్ హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం నిర్మిస్తున్న విఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతున్నదని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఈరోజు ఆయన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పురోగతిని జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టీల్ బ్రిడ్జ్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మూడు నెలలలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలలో నగర ట్రాఫిక్ పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని కేటీఆర్ ఆదేశించారు.

నిర్మాణ పనులను పరిశీలించుకుంటూ విఎస్టి చేరుకున్న మంత్రి కేటీఆర్ అక్కడ దాదాపుగా పూర్తయిన ర్యాంపు పైనుంచి బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పూర్తయిన ఎస్ఆర్డీపీ ఫ్లై ఓవర్ల మాదిరి ఈ స్టీల్ బ్రిడ్జి అద్భుత నిర్మాణంగా మారబోతున్నదని అభిప్రాయపడ్డారు. 2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం దాదాపు 440 కోట్ల రూపాయలను జిహెచ్ఎంసి ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ ని తగ్గించి, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్పేట్ వంటి నియోజక వర్గాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉన్నదని, ఇంతటి కీలకమైన బ్రిడ్జి నిర్మాణం సత్వరంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే సాధారణ కాంక్రీట్ నిర్మాణం కాకుండా స్టీల్ బ్రిడ్జి మార్గంలో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.

స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు ఎస్ ఎన్ డి పి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు మాలిక సదుపాయాల కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హుస్సేన్ సాగర్ నాలాలో చేపడుతున్న పనులను సమీక్షించారు. అశోక్ నగర్ వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటికే ఎస్ ఎన్ డి పి కార్యక్రమంలో భాగంగా వరద ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించి, వరద ప్రమాదాన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా ముందుకు పోవాలని మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular