రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో గణనీయమైన మార్పు కనబడుతోందని, ఇలాంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని దాదాపు 92 శాతం ఇళ్లకు, ప్రతి ఇంట్లో మనం మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ‘జరిగిన మంచిని వివరిస్తూ మనం గడప, గడపకూ కార్యక్రమం చేస్తున్నప్పుడు…. అవునన్నా పథకాలు అందాయి అని… చల్లని ఆశీస్సులు ఆ అక్కచెల్లెమ్మలు మనమీద చూపించినప్పుడు ఆ గ్రామంలో మనకు మద్దతు ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు. “గ్రామం గెల్చినప్పుడు నియోజకవర్గం గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గం గెల్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 కి 175 ఎందుకు రావు?” అంటూ ప్రశ్నించారు.
నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో భేటీల్లో భాగంగా నేడు బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశం అయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సర్వసహజంగా జరుగుతాయని, కానీ మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా గడప గడపకూ ఈ ప్రభుత్వం చేసిన మంచి పని వివరిస్తూ ప్రజల్లోనే ఉంటున్నామని అన్నారు. ఒక్క మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో కేవలం బటన్ నొక్కి ప్రతి ఇంటికి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టామని, వైయస్సార్ పెన్షన్ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా, క్రాప్ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెనతో డీబీటీ ద్వారా ఆధార్ కార్డు సహా ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది స్పష్టంగా చెబుతున్నామని పేర్కొన్నారు. “ఆధారాలతో సహా పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరు మిస్ కాకుండా దేవుడి దయతో అడుగులు వేయగలిగాం” అని జగన్ అన్నారు.
“ప్రజల దీవెనలు మనవైపు కనిపిస్తున్నాయి. కారణం పాలన పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా లంచాలు అవసరం లేదు. వివక్ష చూపించడం లేదు. మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే కచ్చితంగా వచ్చేటట్టు చేస్తాం. మనం చేసిన మంచిని చూసి మార్పు వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు.
Also Read: ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత