పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్ళ బాబాయిని చంపినంత సులభంగా తనను కూడా చంపాలనుకుంటున్నారని… ఇప్పుడు లోకేష్ ను లక్ష్యంగా చేసుకున్నారట’ అని ఆరోపించారు. ‘నాడు తాము ఒక్క అనుకోని ఉంటే మొద్దు శ్రీను చంద్రబాబును ఇంతలోకే వెళ్లి చంపేసే వాడం’టూ ఇటీవల రాప్తాడు వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చందు వ్యాఖ్యలను పరోక్షంగా చంద్రబాబు ప్రస్తావించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కాలనీలకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో బాబు మాట్లాడుతూ… తన పర్యటనలో కనీసం పోలీసులను భద్రత కోసం పంపలేదని, ఒకవేళఎవరైనా వస్తే సాయంత్రానికి వారి మెడ మీద కత్తి పెట్టి బదిలీ చేస్తున్నారని అందుకే పోలీసులు ఎక్కడా కనిపించడంలేదని దుయ్యబట్టారు. నాడు తాను అనుకోని ఉంటే జగన్ ప్రజల్లో తిరిగేవాడేనా అని నిలదీశారు.
జగన్ మోహన్ రెడ్డికి ఓటేస్తే అమరావతి ఉండదని తాను ఆనాడే చెప్పానని, పోలవరాన్ని కూడా ముంచేస్తాడని చెప్పానని కానీ ప్రజలు మైకంలో ఓట్లేశారని వ్యాఖ్యానించారు. ముద్దులు పెడుతున్నారని మోసపోతే పిడిగుద్దులు ఉంటాయని నాడు తాను చెప్పినా ఎవరూ వినలేదన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్యం కలిగించేందుకే తాము ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పుడు కూడా ప్రజలు వినిపించుకోకపోతే రాష్ట్రానికే ఇది చివరి ఛాన్స్ అవుతుందని హెచ్చరించారు. తనకు కొత్తగా వచ్చేది ఏమీ లేదని ఇప్పటికే 14 ఏళ్ళు సిఎంగా పని చేశానని, మరోసారి గెలిస్తే మరో ఐదేళ్ళు సిఎంగా ఉంటానన్నారు. భయపడితే భయమే మనల్ని చంపుతుందని, తెగిస్తే వీరు మనల్ని ఏమీ చేయలేరని ధైర్యంగా పోరాటానికి సిద్ధం కావాలని బాబు పిలుపు ఇచ్చారు.
తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ వైసీనీ నేతలు వాలంటీర్ల ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని, కానీ తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్కటీ ఆపబోనని బాబు స్పష్టం చేశారు. ఇంకా సంపద సృష్టించి మరింత మేలు చేస్తానని వాగ్దానం చేశారు.
Also Read : Kurnool tour: ఒక్క కనుసైగతో…..: బాబు వార్నింగ్