సాయితేజ్ ఆ మధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. ఆ తరువాత జరిగిన ప్రమాదం వలన గ్యాప్ వచ్చేసింది. అందువలన ‘విరూపాక్ష’ హిట్ అతనికి చాలా అవసరమైంది. ఎందుకంటే ఇప్పుడు యంగ్ హీరోల మధ్య పోటీ గట్టిగా ఉంది. అందరూ కూడా తమ కెరియర్ పై పూర్తి ఫోకస్ పెట్టారు. దర్శకనిర్మాతలు అంతా రెడీ చేసిన తరువాత హీరో రంగంలోకి దిగడమనే పద్ధతి చెల్లిపోయింది. ఒక ప్రాజెక్టు ఒప్పుకున్న దగ్గర నుంచి ఆ టీమ్ లో హీరో కూడా ఒక భాగమైపోయి ముందుకు వెళ్లవలసిందే.
యువ హీరోలంతా దర్శక నిర్మతలతో .. రచయితలతో ఫ్రెండ్లీగా ఉంటూనే కొత్తదనం కోసం ట్రై చేస్తున్నారు. అలా ఇంతవరకూ తనకి పరిచయం లేని జోనర్లో సాయితేజ్ ‘విరూపాక్ష’ సినిమా చేశాడు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ ఈ సినిమాకి కథను అందించగా .. సుకుమార్ స్క్రీన్ ప్లే సెట్ చేశాడు. ఈ సినిమాకి ఒక నిర్మాతగా కూడా ఉన్నాడు. యాక్షన్ తో కూడిన హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. పెద్దగా అంచనాలు లేకుండా నిన్న విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది.
కార్తీక్ వర్మ కథను అల్లుకున్న తీరు .. తెరపై దానిని ఆవిష్కరించిన విధానం .. పాత్రలను మలచిన పద్ధతి .. సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే ఈ సినిమా విజయానికి ప్రధానమైన కారణంగా నిలిచాయి. కథ మొదలైన దగ్గర నుంచి చివరి వరకూ దర్శకుడు తల తిప్పనీయడు. అడవితో ముడిపడిన గూడెం నేపథ్యంలో నడిచే ఈ కథను, శ్యామ్ దత్ ఫొటోగ్రఫీ .. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. పట్టుగా … పకడ్బందీగా ఒక కథను అల్లుకుంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. చాలా కాలంగా సాయితేజ్ వెయిట్ చేస్తున్న హిట్ ను ఈ సినిమా అందించిందనే చెప్పాలి.