Friday, November 22, 2024
HomeTrending NewsCongress: బిజెపిపై విమర్శలు... కాంగ్రెస్ చేస్తున్నది ఏంటి?

Congress: బిజెపిపై విమర్శలు… కాంగ్రెస్ చేస్తున్నది ఏంటి?

బిజెపి బీసీలను మోసం చేస్తోందని ఎన్నికల సభల్లో మోత మోగిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి… తమ పార్టీ బీసీలకు ఏం చేసిందో చెప్పటం లేదు. బీసీ నేత బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి….బిజెపి అధికారంలోకి వస్తే బిసి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పటం ఎన్నికల గిమ్మక్కని రాహుల్ విమర్శిస్తున్నారు. మహిళా బిల్లులో బిసి కోటా ప్రకటించని ప్రధాని మోడీ…అధికారం కోసం ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

రాహుల్ ఆరోపణల్లో నిజం ఉంది. మరి కాంగ్రెస్ తెలంగాణలో అనుసరిస్తున్న విధానం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. బిసిలకు అందలం కల్పించేది కాంగ్రెస్ పార్టీనేని రేవంత్ దగ్గరి నుంచి జాతీయ నేతల వరకు ఊదరగొట్టారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది గెలుపు గుర్రాలకే పట్టం అని మాట మారుస్తున్నారు. సర్వేలు చేస్తున్నాం గెలిచే వారికే టికెట్స్ అన్నారు.. ఏమైంది సర్వేలు.

2018 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్ష పదవి..సికింద్రాబాద్ టికెట్ ఇవ్వాలని కాసాని జ్ఞానేశ్వర్ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసినట్టు విశ్వసనీయ సమాచారం. అప్పుడు ఉత్తమ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణలో ఒక సామాజికవర్గంతో కాంగ్రెస్ కు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని… వారితోనే ఉంటుందని, అధ్యక్ష పదవి ఇవ్వటం కుదరదని రాహుల్ తెగేసి చెప్పినట్టు సమాచారం. సికింద్రాబాద్ టికెట్ కాసానికి ఇచ్చినా ఆయన ఓడిపోయారు అది వేరే విషయం. అయితే బిసిల పట్ల కాంగ్రెస్ వైఖరి తెలుసుకునేందుకే ఈ అంశం ప్రస్తావన

బీసీ సామాజికవేత్తలు, ఉద్యోగులు, కుల సంఘాల నేతలు, మేధావులతో విరివిగా సమావేశాలు నిర్వహించారు. టీపీసీసీ ఓబీసీ డిక్లరేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన భేటీలలో బీసీ డిక్లరేషన్‌ కమిటీ చైర్మన్‌ పొన్నం ప్రభాకర్‌ వారి అభిప్రాయలు సేకరించారు. అవన్నీ ఎక్కడకు పోయాయి? సెప్టెంబర్ లో ఢిల్లీ వెళ్లిన బీసీ నేతలకు హస్తిన వేదికగా తీవ్ర అవమానం ఎదురైనట్టు తెలిసింది. పార్టీ పెద్దలు ఖర్గే, సోనియా, రాహుల్‌ కనీసం వారికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. కేసి వేణుగోపాల్ ను కలిసి వచ్చారు.

స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను నిండా ముంచింది కాంగ్రెస్ కాదా? అది గతం అనుకుంటే… మహిళా బిల్లు నాటి నుంచి… బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ చెపుతున్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేయాలని.. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఎన్నికలు సమీపించగానే బీసీలను పక్కన పెడుతున్నారు.

ఓడిపోయే నియోజకవర్గాల్లో మెజారిటి సీట్లు ఇచ్చి బిసిలకు పెద్దపీట అంటున్నారు. ఇలాంటి పార్టీని బీసీలు ఎలా నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న టికెట్లనే ఇవ్వనోళ్లు రిజర్వేషన్లు ఇస్తామంటే ఎలా విశ్వసిస్తారు. 20 మంది బీసీలకు టికెట్స్ ఇస్తే 40 మంది రెడ్డిలకు టికెట్లు ఇచ్చారు. ఇదేనా సామాజిక న్యాయమనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

బీసీ డిక్లరేషన్ ఇస్తామన్నారు.. బిసి ఘర్జన పెడతామన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో షాదనగర్ సభ అని చెప్పి.. దాంతో కొత్త సమస్యలోస్తాయనే వాయిదా వేసినట్టు సమాచారం. 34 స్థానాలు బిసిలకు అని చెప్పి 28 స్థానాలు ఇచ్చేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అందులో సగానికి కన్నా అధికం ఓడిపోయే సీట్లు. అందులో అనుమానం లేదు.

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉదయపూర్ సభ తీర్మానాలకు విలువ ఏది? ఇంటికో టికెట్ మాత్రమే అని గొప్పగా ప్రకటించారు. కొత్తగా చేరిన వారికి కుటుంబానికి రెండు ఇచ్చారు. పారాచూట్స్ కు టికెట్స్ లేవు అన్నారు. సుమారు 40 స్థానాలు వారికే ఇచ్చారు. ఇంతకంటే ఘోరం ఉంటదా. నిన్న మొన్న చేరిన వారికి టికెట్స్ ఇచ్చారు. కొంతమంది పార్టీలో చేరకముందే ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు.

హస్తం వైపు గాలి వీస్తోందని కొన్ని సర్వేల్లో రాగానే… ఢిల్లీ నిర్ణయాలు… కొన్ని కులాల పెత్తనం మొదలైంది. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారితే నీకు బుద్ది ఉందా.. సిగ్గుందా అని రేవంత్ విమర్శలు చేశారు. ఆ స్థాయిలో విష్ణువర్ధన్ రెడ్డిని, నాగం జనార్ధన్ రెడ్డిలపై విమర్శలు ఎక్కు పెట్టగలరా అని హస్తం నేతలే అంటున్నారు. ఈవిధమైన గురువింద గింజ రాజకీయాలు ఓటర్లను ఏ మేరకు మెప్పిస్తాయో చూద్దాం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్