వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన కారణంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ప్రగతి భవన్‌ను ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో- పోలీసులు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. లోటస్ పాండ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.
కొద్దిసేపటి కిందటే వైఎస్ షర్మిల పోలీసుల కళ్లు గప్పి లోటస్ పాండ్ నివాసం నుంచి బయటికొచ్చారు. ప్రగతి భవన్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో ఆమెను పంజాగుట్ట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. సొంతంగా కారును డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్ వైపు వెళ్లారామె. కారులో ఒంటరిగా వెళ్లిన విషయం తెలుసుకున్న వెంటనే లోటస్ పాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు పంజగుట్టకు చేరుకున్నారు.
తాను రోజూ వినియోగించే కారులో కాకుండా- పార్టీ నాయకుల కారులో ఆమె లోటస్ పాండ్ నుంచి బయటికి వచ్చారు. మార్గమధ్యలో కారు మారారు. సోమవారం టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో అద్దాలు పగిలిన కారులో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు. పంజాగుట్ట జంక్షన్ వద్ద పోలీసులు ఆమెను అడ్డుకుని, అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను అడ్డుకోవడానికి వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రలో బస్సును తగులబెట్టడం ద్వారా భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అన్ని అనుమతులు తీసుకునే తాము పాదయాత్ర చేస్తున్నామని, శాంతిభద్రతల బూచిగా చూపించి తనను అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.