Sunday, January 19, 2025
HomeTrending NewsBR Ambedkar: ప్రారంభానికి సిద్దం.. అంబేద్కర్‌ స్మృతివనం

BR Ambedkar: ప్రారంభానికి సిద్దం.. అంబేద్కర్‌ స్మృతివనం

హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌ చెంత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం ప్రారంభానికి ముస్తాబైంది. దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల విగ్రహ ఏర్పాటు తుది అంకానికి చేరుకున్నది. దేశంలో ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని, స్మృతివనాన్ని తీర్చిదిద్దుతామని 2016 ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు.

ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ పక్కన దాదాపు 11.34 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్‌ స్మృతి వనాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా ప్రాజెక్టు జాప్యమైంది. కొవిడ్‌ వైరస్‌ భయం సద్దుమణిగిన అనంతరం ప్రాజెక్టు మళ్లీ వేగం పుంజుకున్నది. షెడ్యూల్డ్‌ కుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఆ డిజైన్‌ బాధ్యతను డిజైన్‌ అసోసియేట్స్‌కు అప్పగించింది. ఆ సంస్థ మొత్తంగా రూ.146.50 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ ఆధ్వర్యంలో 2021 జూన్‌ 3న నిర్మాణ ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకాల మేరకు నిర్దేశిత గడువు 2023 ఏప్రిల్‌ 30 కంటే ముందుగానే పనులు పూర్తి కావడం విశేషం.

దేశీయంగానే విగ్రహం తయారీ
అంబేద్కర్‌ విగ్రహాన్ని పూర్తిగా దేశీయంగానే తీర్చిదిద్దడం గర్వకారణం. నోయిడా డిజైన్‌ అసొసియేట్స్‌కు అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత రాం వన్‌జీ సుతార్‌, ఆయన కుమారుడు అనిల్‌ సుతార్‌ విగ్రహ నమూనాలను తీర్చిదిద్దారు. తొలుత ఉక్కుతో విగ్రహన్ని తీర్చిదిద్ది ఆపై ఇత్తడి తొడుగులను బిగించడం విశేషం. ఇత్తడి విగ్రహం నమూనాలను ఢిల్లీలో పోతపోసి హైదరాబాద్‌కు తరలించారు. విగ్రహం దాదాపు 3 దశాబ్దాల పాటు మెరుస్తూ ఉండేలా పాలీయురేతీన్‌ కోటింగ్‌ వినియోగించారు.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైనది అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం. భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో మూల పురుషుడు. ఆ భావన ప్రస్ఫుటమయ్యేలా అత్యంత ఎత్త్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న స్మారక భవనాన్ని పార్లమెంట్‌ భవనం తరహాలో రూపొందించారు. 2,476 చదరపు అడుగుల విస్తీర్ణంలో వృత్తాకారంలో, చుట్టూ భారీ ఎత్తయిన పిల్లర్లతో భవనాన్ని నిర్మించడం విశేషం. ఆకృతిలోనే కాకుండా రూపంలోనూ అదే తరహాలో తీర్చిదిద్దారు. రాజస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా ధోల్‌పూర్‌ లేతగోధుమ, ఎరుపు రంగు ఇసుక రాళ్లను తెప్పించారు. పిల్లర్లు, భవన ప్రాంగణానికి మెరుగులు దిద్దారు.

స్మృతివనంలో రాక్‌ గార్డెన్‌
అంబేద్కర్‌ స్మృతివనాన్ని 2.93 ఎకరాల్లో తీర్చిదిద్దుతున్నారు. పచ్చదనంతోపాటు రాక్‌ గార్డెన్‌, ఫౌంటెయిన్‌, పూలవనాలు, కాలిబాటలు ఏర్పాటు చేయనున్నారు. టాయిలెట్‌ బ్లాక్‌, టికెట్‌ కౌంటర్‌, సెక్యూరిటీ రూమ్‌ నిర్మాణాలు ఉన్నాయి. స్మృతివనం చుట్టూ ప్రహరీని ఎత్తయిన గ్రిల్స్‌తో ఏర్పాటు చేశారు.

మూడంతస్తుల్లో స్మృతిభవనం
అంబేద్కర్‌ స్మృతిభవనాన్ని మూడంతస్తుల్లో నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో టాయిలెట్స్‌, ఏసీ ఔట్‌డోర్‌ యూనిట్స్‌, స్టోర్‌ రూమ్స్‌ నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ లేదంటే మధ్య భాగంలోనే కీలకమైన నిర్మాణాలను చేపట్టారు. ప్రధాన కాన్ఫరెన్స్‌ హాలు, మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్‌ హాల్‌ ఏర్పాటు చేశారు. ఇందులో అంబేద్కర్‌ జీవితంలోని కీలకమైన, మరుపురాని ఘట్టాలకు సంబంధించిన వీడియోలను నిత్యం ప్రదర్శించనున్నారు. ఇదే ఫ్లోర్‌లో అంబేద్కర్‌ జీవిత విశేషాలను తెలిపే ఫొటో గ్యాలరీని సైతం ఏర్పాటు చేశారు. పై అంతస్తులో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన పీఠం ఉంటుంది. దీనిని సందర్శకులు తిరుగాడేందుకు వీలుగా తీర్చిదిద్దారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్