సిఎం జగన్ కు ఉత్తరాంధ్రపై ఎలాంటి ప్రేమా, దోమా లేవని… అడ్డగోలుగా అధికార పార్టీ నేతలు భూములు దోచుకుంటుంటే మాట్లాడే నేతలే లేరని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో ని భూములను పరిశీలించారు. సాగునీటి ప్రాజెక్టుకు కాచ్ మెంట్ ఏరియాగా ఉన్న ఈ భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చారని ఆరోపించారు. దీనికి ఎలాంటి అనుమతులూ లేవని, పర్యావరణ విధ్వంసం జరిగిందని, వాల్టా చట్టాన్ని కూడా అతిక్రమించారని అన్నారు. ఉద్యోగాలు లేవు కానీ రియల్ ఎస్టేట్ వెంచర్లు మాత్రం వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఒక వైపు ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలు లేవని, ఇక్కడి నుంచి వలసలు వెళుతున్నారని కానీ అధికార పార్టీ నేతలు ఇక్కడ 13 వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారని ధ్వజమెత్తారు. అనుమతులు లేనిచోట రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారని, పైగా దీనికి వంద అడుగులు రోడ్డు, కొండమీద దిగడానికి హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేశారని అన్నారు. 600 ఎకరాలు పోరంబోకు, దళితుల భూములున్నాయన్నారు. రంగబోలు ప్రాజెక్టుకు 47 ఎకరాల క్యాచ్ మెంట్ ఏరియా ఉందని వివరించారు. ఈ దోపిడీకి స్థానిక ఎమ్మెల్యేలు కూడా వత్తాసు పలుకుతున్నారన్నారు. ఇక్కడి యువతలో ఎంతో నైరాశ్యం ఉందని, అందుకే 20 కిలోమీటర్ల పాటు లోపలి ఉన్నా ఇంతమంది యువత ఇక్కడికి కదిలి వచ్చారని పవన్ వివరించారు.