సిద్దం సభల తర్వాత తమ పార్టీ గ్రాఫ్ ఇంకా బాగా పెరుగుతోందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సభలకు వస్తున్న స్పందన చూసిన తరువాత తమ లక్ష్యం 175 నేరవేరుతుందన్న ధీమా కనిపిస్తోందన్నారు. అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారి పక్కన మార్చి 10న జరగనున్న ‘సిద్ధం’ సభ ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పరిశీలకులతో ఒంగోలు పట్టణంలో జరిగిన సన్నాహక సమావేశంలో విజయసాయి పాల్గొన్నారు. సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరించి, క్యాంపెయిన్ సాంగ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ మేదరమెట్ల సభతో సిద్ధం సభలు పూర్తవుతాయని, ఆ తరువాత ఎన్నికల ప్రచారం మొదలవుతుందని…. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈ సభకు 15 లక్షల మంది హాజరవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల పది నెలల కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందనేది సిఎం జగన్ వివరిస్తారని… ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమం కోసం, వారి రాజకీయ సాధికారత కోసం చేపట్టిన చర్యలు విశదీకరిస్తారని తెలిపారు. రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచబోయే అంశాలను కూడా మేదరమెట్ల సిద్ధం సభలో జగన్ వెల్లడిస్తారని విజయసాయి చెప్పారు. రాబోయే ఐదేళ్లపాటు ఏమి చేయబోతున్నమనేది చెబుతారన్నారు.
ఈ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.