బ్రహ్మంగారి మఠాధిపతి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య నేడు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. కుటుంబ సభ్యులు కలిసి కూర్చుని ఓ ఏకాభిప్రాయానికి రావాలని ఇటీవల మంత్రి వెల్లంపల్లి ఇరు వర్గాలకు స్పష్టం చేశారు, ఈ నేపథ్యంలో ఈ రోజు మఠంలో వెంకటేశ్వర స్వామి ఇద్దరు భార్యల కుటుంబాలు చర్చలు జరిపారు. మొదటి భార్య నలుగురు కుమారులు, రెండో భార్య మారుతి మహాలక్ష్మి హాజరయ్యారు. కేవలం ఐదు నిముషాల్లోనే ఈ భేటీ ముగిసింది.
మొదటి భార్య పెద్ద కొడుకుగా తనకే మఠం బాధ్యతలు అప్పగించాలని వెంకటాద్రి, వీలునామాలో తన పేరు రాశారు కాబట్టి తనకే చెందాలని రెండవ కుమారుడు వీరభద్ర స్వామి పట్టుబడుతున్నారు.
మఠాధిపతిగా తాను ఉంటానని, వెంకటాద్రి ప్రచార కార్యదర్శిగా ఉండాలని వీరభద్రస్వామి అంటున్నారు. ఈ ప్రతిపాదనకు రెండో భార్య మారుతీ లక్ష్మమ్మ మద్దతు పలికారు. అయితే మాతృశ్రీ గా తనను గుర్తించాలని షరతు పెట్టారు. ఉత్తరాదికారిగా తన కుమారుడు గోవిందస్వామిని ప్రకటించాలని కోరారు. ఈ ప్రతిపాదనకు వెంకటాద్రి ససేమిరా అంటున్నారు. మంత్రి ఇచ్చిన తుదిగడువు నేటితో ముగుస్తుండడంతో సాయంత్రం 4గంటలకు మరోసారి కుటుంబ సభ్యులు సమావేశం కానున్నారు.
మరోవైపు శైవ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను కలుసుకున్నారు. బ్రహంగారి మఠాధిపతి ఎంపికపై 150 పేజీల నివేదికను శివస్వామి మంత్రికి అందజేశారు.