Saturday, November 23, 2024
HomeTrending Newsబాబువి సానుభూతి డ్రామాలు: అప్పలరాజు

బాబువి సానుభూతి డ్రామాలు: అప్పలరాజు

రాబోయే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని… ఈ విషయాన్ని తాము కూడా ఎప్పటినుంచో చెబుతున్నామని, నిన్న కర్నూలులో బాబు కూడా స్వయంగా ఒప్పుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి మంత్రి డా. సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.  అయితే చంద్రబాబు సెంటిమెంట్ జత చేసి  ప్రజలనుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేశారని, రాజకీయం కోసం ఎంతకైనా దిగజారతారన్న విషయాన్ని మరోసారి ఆయన రుజువు చేసుకున్నారని మండిపడ్డారు. మరోసారి బాబు తన సతీమణి భువనేశ్వరి పేరు ప్రస్తావించి ప్రజలముందు చులకన చేశారని, ఈ విషయమై కనీసం ఆయన కుటుంబ సభ్యులు అయినా బాబును వారించాలని అప్పలరాజు సూచించారు. బాబు ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తారనేది మరోసారి నిన్నటి వ్యాఖ్యలతో తెలిపోయిందన్నారు.

విశాఖ రాజధానిపై మొన్నటివరకూ విషం చిమ్మారని, ఇప్పుడు సీమకు వెళ్లి కర్నూలులో హైకోర్టుకు వ్యతిరేకమని బాబు ఎందుకు బహిరంగంగా చెప్పలేకపోయారని అప్పలరాజు బ్నిలదీశారు. పైగా తాను హైకోర్టుకు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగానే బాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన సాగుతోందన్నారు. ఉత్తరాఖండ్ లో హైకోర్టు ను మార్చేందుకు అక్కడి ప్రభుత్వం అసెంబ్లీ లో బిల్లు ప్రవేశపెట్టిందని, అక్కడ వీలు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని మంత్రి ప్రశ్నించారు. బాబు లాంటి వ్యక్తులు ఎన్ని డ్రామాలు ఆడినా జగన్ ను ఏమీ చేయలేరని, జగన్ పై కనీసం వీధి రౌడీలు కూడా మాట్లాడలేని భాష బాబు ప్రయోగిస్తున్నారని, జగన్ ను ఏం పీకగలుగుటారు అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. నమ్మకమే పెట్టుబడిగా రాజకీయాల్లో జగన్ ఈ స్థాయికి వచ్చారని… కానీ బాబు మాత్రం వెన్నుపోటుతో, నమ్మినవారిని మోసం చేస్తూ రాజకీయాలు చేస్తూ వచ్చారని ధ్వజమెత్తారు.

నన్ను బతికించండి, తులసి తీర్ధం పోయండి అంటూ  ప్రజలను బాబు వేడుకుంటున్నారని అప్పలరాజు ఎద్దేవా చేశారు. ఈ దేశంలో ఉన్న అన్ని శక్తులు, వ్యవస్థలు తన మీద దాడి చేసినా జగన్ చలించలేదని, తనను ఇబ్బంది పెడుతున్నారని ఎప్పుడూ చెప్పుకోలేదని, కానీ బాబు మాత్రం ఏమీ జరగకపోయినా సానుభూతి కోసం కుటుంబాన్ని బజారుకు ఈడ్చుకున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నా ఏనాడూ ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదన్నారు.

డ్వాక్రా సంఘాలను తానే తెచ్చానని, ఈ విషయాన్ని ప్రధాని కూడా ప్రస్తావించారంటూ బాబు చెప్పుకుంటున్నారని.. కనీసం ఇలా చెప్పుకోవడానికి సిగ్గుండాలని అన్నారు. బాబుకు అంత ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేశారు. నువ్వు కాదు కాదా నీ బాబు వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని, అసభ్య పదజాలంతో తమ నేతను దూషిస్తే తీవ్ర పరిణామాలుంటాయని అప్పలరాజు హెచ్చరించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిపోతుందన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్