దర్శకుడిగా త్రివిక్రమ్ కొంతమంది హీరోలతో పని చేశాడు. అలాగే హీరోగా అల్లు అర్జున్ చాలామంది దర్శకులతో కలిసి పనిచేశాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతవరకూ వచ్చిన సినిమాలు ఒకదానికి మించి మరొకటి భారీ విజయాలను అందుకున్నాయి. ఆ జాబితాలో మనకి జులాయి .. సన్నాఫ్ సత్యమూర్తి .. అల వైకుంఠపురములో కనిపిస్తాయి. ఈ మూడు సినిమాలకు ఈ ఇద్దరి కెరియర్లో ప్రత్యేకమైన స్థానం దక్కడం విశేషం.
అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. అలాంటి సమయం ఎంతో దూరంలో లేదనే ఒక వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. త్రివిక్రమ్ నుంచి ఇటీవలే ‘గుంటూరు కారం’ వచ్చింది. మహేశ్ బాబు అభిమానులను ఈ సినిమా ఆకట్టుకుంది. ఆ తరువాత త్రివిక్రమ్ చేసే సినిమా అల్లు అర్జున్ తో ఉండనుందనే టాక్ వినిపిస్తూనే ఉంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ కసరత్తు చేస్తూనే వస్తున్నాడు.
ఇక అల్లు అర్జున్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘పుష్ప 2’ రెడీ అవుతోంది. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన థియేటర్లకు రానుంది. అందువలన సెప్టెంబర్ నుంచి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రణాళిక సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ వారు కలిసి 300 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా ఒక టాక్ నడుస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చనున్న ఈ సినిమాను, పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లనున్నారు.