Saturday, November 23, 2024
HomeTrending Newsస్థానిక సంస్థల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్ ?

స్థానిక సంస్థల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్ ?

లోక్ సభ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇదే ఉపులో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పంచాయతీ రాజ్ వ్యవస్థలో బీసీల కు 42% రిజర్వేషన్ పై బిసి సంఘాలు గలమెత్తుతున్నాయి.

రిజర్వేషన్లకు అడ్డంకులు ఏమున్నాయని విశ్లేషిస్తే వివిధ అంశాలు వెలుగు చూస్తున్నాయి.

1. తెలంగాణ బీసీ సమాజం కోరుతున్న 42% పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్ కు ప్రధానంగా అడ్డొస్తున్న వాస్తవం సుప్రీంకోర్టు తీర్పు. 2010 మే 11న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తానికి కలిపి 50% రిజర్వేషన్ దాట కూడదు. ఈ తీర్పు అమలులో ఉండగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తమ వాగ్దానానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నా… అది నిలబడదు. సుప్రీంకోర్టు తీర్పు అమలులో ఉన్నంత కాలం అది సాధ్యం అయ్యేది కాదని న్యాయ నిపుణులు చెపుతున్నారు.

2. బీసీలకు 42% మేర పంచాయతీ రాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ నిలవాలంటే, రిజర్వేషన్ 50% దాటి ఇవ్వడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తూ, రాజ్యాంగ సవరణ జరిగి తీరాలి. ఈ సవరణ జరగనంత కాలం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినా కూడా కోర్టులో సవాలు చేస్తే అది నిలబడే అవకాశం లేదు.

3. రాజ్యాంగ సవరణ ద్వారానే ఈ అవరోధాన్ని అధిగమించేందుకు అవకాశం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేదు.  NDA ప్రభుత్వం తమ విధానం మార్చుకొని సహకరిస్తే తప్ప, ఈ సవరణ వీలు కాదు. ఈ పరిస్థితుల్లో బీసీలకు పంచాయతీ రాజ్ వ్యవస్థలో 42% రిజర్వేషన్ వీలు పడక పోవచ్చు.

4. స్థానిక సంస్థల్లో బిసిలకు 42% రిజర్వేషన్ కల్పనకు “సమగ్ర కుల గణన” కూడా అవసరమే. బీహార్ ప్రభుత్వం ఈ మధ్య చేయించిన విధంగానే సమగ్ర కుల గణన తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్వహించుకోవచ్చు. దీనికి న్యాయ వ్యవస్థ కూడా అడ్డుపడే అవకాశం ఉండదు. కారణం సుప్రీంకోర్టు బీహార్ విషయంలో అడ్డు పడడానికి తిరస్కరించింది.

వీటిని సాధించాలంటే, తెలంగాణలో మొదటి దశలో బలమైన బిసి ఉద్యమం మొదలైతేనే ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయ పార్టీలు కదిలి వచ్చే అవకాశం ఉందని మేధావులు వివరిస్తున్నారు. మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం, రాజస్థాన్ లోని జాట్ ఆందోళనలు, గుజరాత్ లో పటేల్ వర్గం నిరసనలు స్పూర్తిగా బిసిలు ఉద్యమిస్తేనే లక్ష్యానికి చేరుకోవచ్చని బిసి సంఘాలు మేధో మధనం చేస్తున్నాయి.

రాజ్యాంగ ఫలాలు సాధించాలంటే అన్ని రకాల కులసంఘాలు విభేదాలు వీడి…అహింసాయుత పద్దతిలో ఉమ్మడిగా నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తేనే 42 శాతం రిజర్వేషన్ సాకారం అవుతుందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్