45 to 18: “దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే
వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే
చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!”
అన్నాడు ధూర్జటి. వయసు పెరిగేకొద్దీ పళ్లు ఊడడం, శరీర కాంతి తగ్గడం, ముడుతలు పడడం, జుట్టు తెల్లబడడం, రోగాలు పలకరించడం, మన మొహం మనమే గుర్తు పట్టలేనంతగా మారిపోవడం సహజం. ఎన్ని యాంటీ ఏజింగ్ క్రీములు మొహానికి దట్టించినా- వయసును ఆపగలమా?
అరవైలో ఇరవై వయసు ఎవరికైనా వచ్చేనా?
“ఎలుకతోలు దెచ్చి యేడాది ఉతికిన,
నలుపు నలుపె గాని తెలుపు రాదు
కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ వినుర వేమా !”
మూడు నాలుగు శతాబ్దాల క్రితమే వేమన కాలానికే ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివాడెవడో నల్లటి ఎలుక తోలును తెల తెల్లటి హంస తోలుగా మారుస్తానని దండోరా వేయించి ఉంటాడు. అదివిని వేమన ఈ పద్యం చెప్పి ఉంటాడు! తెల్ల తోలు మీద మన వ్యామోహం ఈనాటిది కాదు. పెళ్లి సంబంధాల ప్రకటనల్లో పబ్లిగ్గా కారు తెలుపు అమ్మాయికి- బస్సు తెలుపు అబ్బాయి మాత్రమే కావలెను– అని ఇప్పటికీ తెల్లతోలు సంబంధ ప్రకటనలే వస్తున్నాయి. ఈ విషయంలో మనది తోలు మందం వ్యవహారం.
“ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ! “
అని కూడా వేమనే అన్నాడు. పైకి కనిపించే అందం కాకుండా ఆత్మ శుద్ధి లేదా అంతః సౌందర్యం గురించి పాపం వేమన ఎంతగానో గుండెలు బాదుకున్నాడు.
వేమనకు రివర్సులో పౌడర్లు, స్నోలు, ఫేస్ క్రీములు తయారు చేసేవారు కూడా తమ ఉత్పత్తులు వాడకపోతే మీ మొహం మా మొహంలా అఘోరిస్తుందని దండోరా మోగిస్తూనే ఉంటారు.
మొహం మీద మొటిమలు రాకూడదు. వస్తే…వెంటనే కోయించేయాలి.
పెదవి వంకర పోకూడదు. పోతే…కోసి అతుకు పెట్టించుకోవాలి.
బుగ్గమీద మచ్చ పడకూడదు. పడితే…లేజర్ కాంతి కిరణంతో తీసేయించుకోవాలి.
నోట్లో పన్ను వరుస తప్పకూడదు. తప్పితే…పళ్లు ఊడగొట్టించుకుని రూట్ కెనాల్ క్యాపింగ్ వైటనింగ్ సున్నాలు పెయింట్ల పెట్టుడు పళ్లతో కట్టుడు కొరుకుళ్లు మొదలుపెట్టాలి.
పొట్ట లావెక్కకూడదు. ఎక్కితే…రంపం పెట్టి కడుపుకోతకు సిద్ధం కావాలి.
చూపు మందగించి కళ్లజోడు వస్తే ఒప్పుకోకూడదు. లేజర్ రేజర్లతో కనుపాపను కోయించుకుని…మన కంటిని మనమే నిద్రపుచ్చాలి.
బట్టతల వస్తుంది. వస్తే…తల గోడకేసి కొట్టుకుని…నెత్తిన జుట్టును కృత్రిమంగా నాటించుకోవాలి.
వయస్సునామీ మీద పడుతుంది. పడితే…అస్సలు ఒప్పుకోకూడదు. సునామీకయినా ఎదురెళ్ళవచ్చు కానీ…వయసు కనపడకూడదు. కనపడితే…యాంటీ ఏజింగ్ క్రీములు వాడాలి. కోతలు, వాతలు, నలుగులు, పులుములు, మసాజులు, రుద్దుళ్ళు, దిద్దుళ్ళు మొదలుపెట్టాలి.
తింటే…లావెక్కి…కొవ్వెక్కి…బలుపెక్కుతారు. కాబట్టి మితంగా మూడుపూటలా గాలిని మాత్రమే భోంచేయాలి. అన్నం ఒట్టి కార్బో హైడ్రేట్ సున్నం కాబట్టి రొట్టెలే తినాలి. కాఫీ వితవుట్ షుగర్, బజ్జి వితవుట్ ఆయిల్, నిమ్మరసం వితవుట్ పులుపు, కూల్ డ్రింక్ వితవుట్ ఐస్...ఇలా “వితవుట్ ఫుడ్” కాన్సెప్ట్ లో పక్షులు, జంతువులు తిన్నట్లు ఆకులు, అలములు తినాలి. వండినవి తినద్దని ఒకడంటాడు. కాల్చినవి తినద్దని ఒకడంటాడు. కడుపుకు గడ్డి తినమని ఒకడంటాడు. వయసును దాచుకోవడానికి నానా గడ్డి కరవమని ఒకడంటాడు. అవన్నీ విని బుద్ది గడ్డి తింటుంది. గుడ్డి గడ్డికి డిమాండు పెరుగుతుంది.
అమెరికాలో బాగా డబ్బుచేసిన ఒక 45 ఏళ్ల ఆసామికి వయసు మీద పడుతున్నట్లు అనిపించగానే ఎక్కడలేని నిస్సత్తువ ఆవరించింది. తన మొహం అద్దంలో చూసుకుంటే భవిష్యత్తు మరింత పండుటాకులా స్పష్టంగా కనిపించింది. దాంతో సంవత్సరానికి పదహారు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ పదహారేళ్ళ పిల్లాడిగా మారిపోవడానికి సౌందర్య చికిత్సలు చేయించుకుంటున్నాడు. బహుశా నాలుగయిదేళ్లపాటు ఈ విచికిత్స ఉంటుందేమో! ఒక వంద కోట్లు ఖర్చు అయ్యాక నాలుగు పదుల వయసు వెనక్కు తన్ని…పదో క్లాసుకెళ్లే పిల్లాడు అవుతాడో! కాడో! కానీ…ప్రకృతిని అంగీకరించని మన వికృతికి మాత్రం ఇదొక నిత్యనూతన పాఠం!
ఆధునిక వేమన బహుశా ఇలా అంటాడేమో:-
“ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు తెలుపుగాకపోదు…
కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా
చక్కగా పలుకకపోదు…
కడివెడయినను చాలవు ఖరము పాలు…
తళుకు బెళుకు రాళ్లు తట్టెడయినను చాలవు…
విశ్వదాభిరామ ఇసుకలో మా మొహాలేసి తోమ…”
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]