Wednesday, October 4, 2023
HomeTrending Newsకార్పొరేట్ శక్తుల కేంద్రంపై యుద్దమే - బిఆర్ఎస్

కార్పొరేట్ శక్తుల కేంద్రంపై యుద్దమే – బిఆర్ఎస్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని బిఆర్ఎస్ అధినేత, సిఎం కె.చంద్రశేఖర్ రావు పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంటు జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజా సమస్యల పై గొంతుని వినిపిస్తూ కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని సిఎం అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథాలో వీలయినన్ని అన్ని మార్గాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దిశగా బిఆర్ఎస్ పార్టీతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సిఎం కేసీఆర్ పేర్కొన్నారు .

ఆదివారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశం అనేక అంశాలను చర్చించింది. కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత, ప్రమాదకర విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు తీరని నష్టం వాటిల్లుతున్నదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు (రాజ్యసభ), నామా నాగేశ్వర్ రావు (లోక్ సభ), ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ కవితా నాయక్, పసునూరి దయాకర్, బొర్లకుంట వెంకటేశ్, పోతుగంటి రాములు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…. ‘‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు అభివృద్ధికి ఆటంకాలుగా మారినాయి. ఇది దురదృష్టకరం. దేశ ప్రజలు తమ కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా అప్పనంగా తమ కార్పోరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారు. తమకు అనుకూల కార్పోరేట్ శక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రేమ కురిపిస్తూ లక్షలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్నది. ఎల్ ఐ సి వంటి ప్రభుత్వ రంగ సంస్థల చేత అదానీ వంటి బడా వ్యాపారవేత్తల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి ఎల్ ఐ సి కి , మొత్తం దేశ ప్రజల బీమా సొమ్ముకు నష్టం కలిగిస్తున్నది. వారి కంపెనీల డొల్లతనం బైటపడుతూ వారి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతూ లక్షల కోట్ల రూపాయలు వొక్క రోజులోనే నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తున్నది. వారి లాభాలు సంపదంతా నీటిబుడగలేనని స్పష్టమైతున్నది. ఇటువంటి ఆర్థిక అవకతవకలకు దోహదం చేసే విధంగా దేశ సంపదనంతా ప్రయివేట్ పరం చేస్తూ కేంద్రం తీరని నష్టం చేస్తున్నది.

లాభాలను ప్రయివేట్ పరం చేస్తూ… నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర ఆర్ధిక విధానాల మీద పార్లమెంటు ఉభయ సభల్లో గొంతెత్తాలి. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఖరిని బిఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ఖంఢించాలె. అదే సందర్భంలో… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీనిపైనా పార్లమెంటులో నిలదీయాలి. ప్రగతి పథంలో నడుస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రానికి ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తూ ప్రగతిని అడ్డుకుంటున్న కారణమేందో జాతికి చెప్పాలని కేంద్రాన్ని నిలదీయాల్సి వున్నది. అక్కడితో ఆగకుండా గవర్నర్ల వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికం. రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తిస్తూ కేంద్ర , రాష్ట్రాల నడుమ సంధాన కర్తలుగా వుండాల్సిన గవర్నర్ల వ్యవస్థను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న దుర్మార్గ విధానాలను బిఆర్ఎస్ ఎంపీలుగా మీరు ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలి.

రాష్ట్ర కేబినెట్ సహా, రాష్ట్ర అత్యున్నత సభలైన శాసన సభ, శాసన మండలి తీసుకున్న నిర్ణయాలను సైతం ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెడుతూ గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని, అభివృద్ధిని పాలనను అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలను, కేంద్రం వైఖరిని మీరు పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలి. దేశ భవిష్యత్తు కోసం, ప్రజా సమస్యల మీద పార్లమెంటులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మీద పోరాటానికి మనతో కలిసివచ్చే ప్రతివొక్క పార్టీ ఎంపీని కలుపుకుని పోండి. పెట్రోల్ డీజిల్ సహా వంటగ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నయి. సామాన్యుడి బతుకు పెరుగుతున్న ధరలతో రోజు రోజుకూ భారమైపోతున్నా కేంద్రానికి ఏమాత్రం పట్టింపులేదు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అనుభవిస్తున్న బాధలను కష్టాలను పార్లమెంటు ఉభయ సభల ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకపోవాలె. ’’ అని బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

రోజు రోజుకూ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నదని, దేశ యువతను ఏమాత్రం పట్టించుకోకుండా, వారికి ఉద్యోగ భధ్రత కల్పించకుండా, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తూ తీరని నష్టం చేస్తున్నది. ఈ అంశం పై గట్టిగా గొంతు వినిపించాలని సిఎం కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన విభజన హామీల పై కేంద్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని, ఇందుకు సంబంధించీ గొంతెత్తాలని సిఎం స్పష్టం చేశారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటిని సాధించుకునే దిశగా పార్లమెంటులో గొంతు వినిపించాలని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న