గత రెండు రోజులుగా పుట్టలో పడుకున్న పాములు బయటకు వచ్చి నన్ను నిందించే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇటీవల అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాల గురించి వివరించానని, వారి సందేహాలను నివృత్తి చేసామన్నారు. బీఆర్ ఎస్ నేతలు ఉచిత విద్యుత్ అంశంలో కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. 24గంటల విద్యుత్ సరఫరా విషయంపై సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేసామని, కేటీఆర్, బీఆరెస్ మా వీడియోను ఎడిట్ చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. బీఆరెస్ చిల్లర ప్రయత్నంతో రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పై చర్చకు అవకాశం వచ్చిందన్నారు.
వైఎస్ పాదయాత్ర చేసి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి నెరవేర్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగిన సందర్భంలో కేసీఆర్ హెచ్ఆర్డీ విభాగం అధ్యక్షుడుగా ఉన్నారని, ఉచిత విద్యుత్ సాధ్యం కాదని ఆనాడు కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన సందర్భంలో కేసీఆర్ కీలక స్థానంలో ఉన్నారన్నారు. వ్యవసాయం అంటే ఏమిటో నాకు తెలుసు…. నాగలి పట్టడం, గుంటుక కొట్టడం తెలిసిన వాడినని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ లా నేను అమెరికాలో బాత్రూంలు కడగలేదన్నారు. వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న రైతు బిడ్డను నేను….నేను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకును కాదన్నారు.
24గంటల విద్యుత్ ముసుగులో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని, 24 గంటల ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ కు ఎలాంటి శశభిషలు లేవని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరతామని భరోసా ఇచ్చారు. సెప్టెంబర్ 17న మా మేనిఫెస్టోలో ప్రకటిస్తాం..ఉచిత విద్యుత్ ముసుగులో ఏడాదికి 8వేల కోట్లు దోచుకుంటున్నారన్నారు. పవర్ ప్లాంట్ల విషయంలో కేసీఆర్ 45వేల కోట్లకు టెండర్లు ఇచ్చి అందులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
కరీంనగర్ చౌరస్తాలో గుమ్మికింద పందికొక్కు నన్ను ఉరి తీస్తా అని మాట్లాడుతుండని రేవంత్ రెడ్డి అన్నారు. నేను చంద్రబాబు శిష్యుడినని చెబుతున్నారు…మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన మీరా నా గురించి మాట్లాడేదన్నారు. 25 లక్షల 50వేల మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించబోతుందని, ఇది నిజం కాదని చెప్పడానికి మీలో ఎవరు వస్తారని సవాల్ చేశారు. ఖమ్మంతో మేం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే… నిన్న నిరసనలతో బీఆరెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిందన్నారు. 24గంటల విద్యుత్ పై గతంలో సీబీఐ విచారణ కోరిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణ కొరడంలేదని, 24 గంటల ఉచిత విద్యుత్ పై ఏ సబ్ స్టేషన్ లోనైనా చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.