సీఆర్డీఏ పరిధిలోని ఆర్ 5 జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మొదలు పెట్టిన జగనన్న ఇళ్ళ నిర్మాణం నిలిచిపోయింది. సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
సుప్రీం కోర్టు అమరావతి కేసును డిసెంబర్ నాటికి వాయిదా వేసింది. దీనితో అప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణాన్ని నిలిపి వేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమరావతిపై ఇప్పటికే ఏపీ హైకోర్టు రిట్ అఫ్ మాండమస్ జారీ చేసింది. దీనిపై దాఖలైన పలు వ్యాజ్యాలను కలిపి విచారిస్తామని పేర్కొంటూ డిసెంబర్ నాటికి కేసును వాయిదా వేసింది.
సీఆర్డీఏ చట్టంలో ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన స్థలంలో కొత్తగా ఆర్ 5 జోన్ ను ఏర్పాటు చేసి దానిలో 1,829.57 కోట్ల రూపాయల ఖర్చుతో 50,793 ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇళ్ళ పట్టాల పంపిణీకి ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అమరావతిపై తుది తీర్పు వచ్చే వరకూ లబ్దిదారులకు ఎలాంటి హక్కు పత్రాలూ ఉండబోవని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. మే 26 న ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన సిఎం జగన్ జూలై 24న ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ చేశారు. డిసెంబర్ లోగా ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ నేటి తీర్పుతో ఇళ్ళ నిర్మాణం నిలిచిపోనుంది.