Saturday, November 23, 2024
HomeTrending NewsGaddar: ప్రజా యోధుడు గద్దర్: జన సేనాని ఘన నివాళి

Gaddar: ప్రజా యోధుడు గద్దర్: జన సేనాని ఘన నివాళి

ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. జూలై నెల చివరి వారంలో ఆస్పత్రిలో గద్దర్ ను స్వయంగా పరామర్శించిన పవన్ నేడు ఆయన మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని గద్దర్ కు నివాళులర్పించారు.

గద్దర్ మరణంపై పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తన జీవితంపై ఆయన చూపిన ప్రభావాన్ని వెల్లడించారు.

“ప్రజా గాయకుడు శ్రీ గద్దర్ గారు మరణించారంటే నమ్మశక్యం కావడం లేదు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన్ని పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితమే వెళ్ళాను. తమ్ముడా… అంటూ ఆప్యాయంగా పలకరించి, ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించీ, జాతీయ అంతర్జాతీయ విషయాలు ఎన్నింటినో మాట్లాడారు. ‘మా భూమి’ చిత్రంలో ఆయన గానం చేసిన ‘బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి…” అనే చైతన్య గీతం అజరామరం. నా చిన్నతనంలో విన్న ఆ గీతమే నాకు గద్దర్ అనే పేరును పరిచయం చేసింది. తాడిత పీడిత అణగారిన వర్గాలను చైతన్యం చేయడమే లక్ష్యంగా పోరుసల్పిన శ్రీ గద్దర్ గారు తుది శ్వాస వరకూ అదే బాటలో పయనించారు. గద్దర్ అనగానే గజ్జె కట్టి గళమెత్తి… కెరటంలా దుమికే ఆ రూపమే గుర్తుకు వస్తుంది. గానం చేసేటప్పుడు ఆయన ఆంగికం, ఆహార్యాన్ని నేటి తరం పోరాట గాయకులు అనుసరిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఒగ్గు కథ, ఎల్లమ్మ కథ, బుర్ర కథల రూపంలో సామాజిక సమస్యలపై చైతన్యపరచిన విధానం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

‘నీ పాదమ్మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ… తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ…’ అనే పద ప్రయోగం ఊహకు అందనిది.. అనిర్వచనీయమైనది. విప్లవ గీతాలను ఎంత సునాయాసంగా రాయగలరో…. భావుకత నిండిన గీతాలను అంతే అలవోకగా రాయగలరనిపించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన శ్రీ గద్దర్ గారు పీడిత వర్గాల కోసం . ఆయనపడిన తపన, చేసిన పోరాటమే ఆయన్ని చిరస్మరణీయుణ్ణి చేశాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో తన కలం, తన గళంతో ఆయన నిర్వర్తించిన పాత్ర విస్మరించలేనిది.

శ్రీ గద్దర్ గారి మరణం ఆయన కుటుంబానికే కాదు… తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. శ్రీ గద్దర్ గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన్ని చివరిసారిగా కలిసినప్పుడు ‘నీ అవసరం నేటి యువతకు ఉంది’ అంటూ నాకు చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేనివి” అంటూ ఆయనకు నివాళి అర్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్